Saturday, 23 July 2016

చేతుల్లేకపోతేనేం.. లక్ష్యం ఉంది!

శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పని చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లే చాలామంది ఎలాంటి లక్ష్యాలూ లేకుండా వృథాగా జీవితాన్ని గడిపేస్తారు. ఈ యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నం. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల విశ్వాస్‌ కేఎస్‌ ఈ ఏడాది కెనడాలో జరిగిన పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలో భారత్‌ తరఫున మూడు బంగారు పతకాలను గెలుపొందాడు. బటర్‌ఫ్లై, బ్యాక్‌ స్ట్రోక్‌, బ్రెస్ట్‌ స్ట్రోక్‌ అంశాల్లో విజయం సాధించి మూడు స్వర్ణాలను అందుకున్నాడు. గతేడాది బెళగావిలో జరిగిన పారా స్విమ్మింగ్‌ పోటీల్లోనూ 3 రజతాలను కైవసం చేసుకున్నాడు. ఇవన్నీ సాధించిన విశ్వాస్‌కు రెండు చేతులూ లేవంటే నమ్మగలరా?
విద్యుత్తు ప్రమాదంలో..
విశ్వాస్‌ తండ్రి సత్యనారాయణమూర్తి వ్యవసాయ శాఖలో క్లర్క్‌గా పనిచేసేవారు. పదహారేళ్ల క్రితం తాము కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గోడలకు నీరు పెడుతుండగా విశ్వాస్‌ అదుపు తప్పి విద్యుత్తు తీగలపై పడిపోయాడు. కొడుకుని కాపాడే క్రమంలో విద్యుత్తు షాక్‌ తగలడంతో సత్యనారాయణమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వాస్‌ సుమారు రెండు నెలలు కోమాలో ఉన్నాడు. పైగా రెండు చేతుల్నీ కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం బతుకుదెరువు కోసం కుటుంబం బెంగళూరు చేరుకుంది. అక్కడే విశ్వాస్‌ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినప్పటికీ స్మిమ్మింగ్‌లో రాణించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. దాని కోసం కుంగ్‌ఫూ, నృత్యం, ఈత తరగతులకు హాజరయ్యేవాడు. విశ్వాస్‌ స్విమ్మింగ్‌లో ప్రొఫెషనల్‌గా రాణించేందుకు శిక్షకులను ఏర్పాటుచేసి, మౌలిక వసతులను కల్పించడానికి ఆస్థా, బుక్‌ ఎ స్మైల్‌ అనే ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం తన లక్ష్యం అని విశ్వాస్‌ చెబుతున్నాడు.

No comments:

Post a Comment