ఢాకా :
వృద్ధాప్యం శాపం అంటారు. అయితే పుట్టకతోనే వృద్ధాప్యం ముంచుకువస్తే అది
ప్రత్యక్ష నరకమే. దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఓ బుడతడు ఇలాంటి వైకల్యంతోనే
బాల్యంలోనే వృద్ధాప్య దశను అనుభవిస్తూ క్షణమొక యుగంలా బతుకు గడుపుతుండటం
ఆతని తల్లిదండ్రులను కలిచివేస్తోంది. ఆ బాలుడి పేరు బయెజిద్ హుస్సేన్.
పుట్టి నాలుగేళ్లే అయినా పది రెట్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు.
వైద్యపరిభాషలో అతనికి ఉన్న జన్యుపరమైన లోపాన్ని 'ప్రిజేరియా' అని
పిలుస్తారు. ఉబ్బిపోయిన ముఖం, అంటుకుపోయిన దవడలు, వేలాడుతున్న చర్మం,
మూత్రవిసర్జన కష్టంకావడం, పళ్లు బలహీనంగా, విరిగిపోయినట్టు ఉండటం వంటివి ఈ
వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ బయెజిద్‌లో చోటుచేసుకోవడంతో ఆ ఈడు పిల్లలు
కూడా అతనితో ఆడుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని చూసి తల్లి
త్రిప్తి ఖతున్ తల్లడిల్లిపోతోంది. 'బయెజిద్ మూడేళ్ల వయస్సులో నడవడం
నేర్చుకున్నాడు. ఆ వయస్సులోనే అతనికి అన్ని పళ్లూ వచ్చేశాయి. అసాధారణరీతిలో
శారీరక ఎదుగుదల ఉన్నప్పటికీ మానసికంగా ఎదగలేదు. అయినా ఎంతో చక్కగా
మాట్లాడతాడు. వయసుకు మించిన గ్రాహ్యశక్తి ఉంది' అంటూ త్రిప్తి
వెల్లడించింది. తన పిల్లవాడు ఇతర పిల్లల్లా చూడలేడని, వృద్ధాప్యంలో ఉన్న
మనిషిలా ఉంటాడని వాపోయింది. తనకు కలిగిన మొదటి సంతానమే ఇలా కావడం తనను
కలిచివేస్తోందంటూ కంటతడిపెట్టింది.
సహజంగా
ప్రిజేరియాతో బాధపడుతున్న వారి జీవనప్రమాణం 13 ఏళ్ల వరకూ ఉంటుంది.
గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తన కుమారుడు పుట్టినప్పటి
నుంచి తాము కలవని డాక్టరు కానీ, సంప్రదించని వ్యక్తులు కానీ లేరని బయెజిద్
తండ్రి లవ్లు తెలిపాడు. ఇప్పటి వరకూ 4 వేల పౌండ్లకు పైగా ఖర్చు చేశామని,
అయితే ఎవరికీ వైద్యం అంతుపట్టలేదని వాపోయాడు. 'ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి
మార్పూ లేదు. పైగా రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది' అని
చెప్పుకొచ్చాడు. తన కుమారుడు అందరిలాంటి పిల్లవాడు కాదని, కన్నకొడుకు
రోజురోజుకూ మృత్యువుకు చేరువవుతున్నాడని తెలిసిన ఏ తల్లిదండ్రులకైనా
అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని అతను వాపోయాడు.

No comments:
Post a Comment