Friday, 15 July 2016

ట్రక్కు దూసుకెళ్లి 80 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర విషాదం 
100 మందికి పైగా గాయాలు  

పారిస్‌: ఫ్రాన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీస్‌ నగరంలో బాస్టిల్‌ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు మృత్యుశకటంలా ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది మృతిచెందగా.. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ట్రక్కు బుల్లెట్లతో తూట్లు పడిపోయింది. ఘటన జరిగిన వెంటన ఉగ్రవాద వ్యతిరేక దళాలు నీస్‌ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

డ్రైవర్‌ కాల్చివేత
విచక్షణారహితంగా ట్రక్కును నడిపి ప్రజల ప్రాణాలు తీసిన డ్రైవర్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. దీనిని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ట్రక్‌ వెనుకభాగంలో తుపాకులు, పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించలేదు.

2 కిలోమీటర్లు..
బాస్టిల్‌ డేలో భాగంగా నిర్వహించే బాణాసంచా పోటీలను వీక్షించేందుకు పెద్దయెత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బాణాసంచాను వీక్షిస్తున్న సమయంలోనే ట్రక్కు అధిక వేగంగా పాదచారుల వంతెనపై నుంచి దూసుకెళ్లింది. సుమారు 2కిలోమీటర్ల మేర అదే వేగంతో దూసుకుపోవడంతో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 100 మందికి పైగా గాయపడ్డారు.

విపరీతమైన వేగంతో..
బాస్టిల్‌డే సంబరాల వీక్షకులను ఢీకొనడానికి ముందు ట్రక్కు విపరీతమైన వేగం అందుకున్నట్లు సమాచారం. ప్రేక్షకులకు దాదాపు 100 మీటర్ల దూరంలో ట్రక్కువేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే వేగంతో అది వీక్షకులను ఢీకొంది.

ఎక్కడ చూసినా భయానక దృశ్యాలు
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడ చూసినా రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉండటంతో వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చు: మేయర్‌
ఈ ఘటన జరిగిన వెంటనే నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్టీరోస్‌ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు.

దాడి చిత్రాలు ఐఎస్‌ మద్దుతు సైట్లలో..!
ఈ ఘటన దృశ్యాలు ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దుతు వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి. కొన్ని ట్విట్టర్‌ ఖాతాల్లో వీటిని ఉంచారు.

భద్రతను సమీక్షించుకోవాల్సి ఉంది: హొలాండ్‌
ఈ ఘటనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలాండ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి తేల్చి చెప్పిందన్నారు. అత్యవసర పరిస్థితిని మరో 3నెలల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

దాడిని ఖండించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నీస్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దర్యాప్తులో పూర్తి సహాయ సహకారాలు అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు.

  

No comments:

Post a Comment