Wednesday, 13 July 2016

రాత్రికి రాత్రే మాయమైన 'శక్తిమాన్'

డెహ్రాడూన్‌: శక్తిమాన్...విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అశ్వం. ఆ అశ్వం స్మృత్యర్థం ఏర్పాటు చేసిన 'శక్తిమాన్' విగ్రహాన్ని కేవలం గంటల వ్యవధిలోనే తొలగించారు. డెహ్రాడూన్‌లోని పోలీస్ లైన్‌లో శక్తిమాన్ విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటు చేసిన ఒక్కరోజుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం దానిని తొలగించింది. 'సోమవారం సాయంత్రం వరకూ విగ్రహం ఉంది. ఇవాళ ఉదయం నేను ఇక్కడకు వచ్చి చూసేసరికి అది కనబడలేదు. విగ్రహం ఎలా మాయమైందో నాకు తెలియదు' అని ఓ స్థానికుడు తెలిపాడు. బీజేపీ ర్యాలీ సందర్భంగా గత మార్చి 14న ఆ పార్టీ ఎమ్మెల్యే గణేష్ జోషి కర్రతో శక్తిమాన్‌పై దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శక్తిమాన్‌ కాలుకి శస్త్రచికిత్స చేసి కృత్రిమ కాలు అమర్చారు. అయినప్పటికీ ఇన్‌పెక్షన్ కారణంగా అది కన్నుమూసింది. ఈ క్రమంలో శక్తిమాన్ స్మృత్యర్థం డెహ్రాడూన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు ఘాటు విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కొందరు బీజేపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎందరో సైనికులు చనిపోతే వారికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదనీ, శక్తిమాన్‌ కోసం విగ్రహం కట్టించి రాద్ధాంతం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమయ్యాయి. శక్తిమాన్‌ విగ్రహాన్ని డెహ్రాడూన్‌లో ఉంచాలా వద్దా అన్న విషయం భవిష్యత్‌ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని హరీశ్‌ రావత్‌ అన్నారు. పదేళ్లకు పైగా పోలీసు విభాగంలో సేవలందించిన శ్వేత అశ్వం 'శక్తిమాన్' గత ఏప్రిల్ 20న కన్నుమూసింది.

No comments:

Post a Comment