మెగా
ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి
150వ సినిమాకు సంబంధించి డైరెక్టర్ దగ్గర్నుంచి హీరోయిన్ వరకూ ఎంతోమంది
పేర్లు వినిపించాయి. ఎన్నో ఊహాగానాలు, పుకార్లు షికారు చేశాయి. చివరికి
వి.వి.వినాయక్ దర్శకుడిగా తమిళ ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా
రూపొందుతోంది. డైరెక్టర్ సంగతి సరే.. మరి హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు హాట్
టాపిక్ అయింది. చిరుతో జత కట్టిన అలనాటి హీరోయిన్ల నుంచి నిన్నమొన్నటి
తారామణుల దాకా ఎంతోమంది ఈ జాబితాలో నిలిచారు. ఈ వరుసలో గ్యాంగ్‌లీడర్‌తో
జతకట్టిన రాములమ్మ పేరూ వినిపించింది.
ఇప్పుడీ
విషయంపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. తనను కలిసిన
పలువురితో ఆమె మాట్లాడుతూ చిరంజీవి 150వ సినిమాలో నటించమని తననెవరూ
సంప్రదించలేదన్నారు. అయితే, ప్రస్తుతం తన మనసులో వేరే ఆలోచన ఉన్నట్లు
బయటపెట్టారామె. హైద్రాబాద్‌లో మత్తు పదార్థాలు సేవించిన యువకుల చేతిలో
అన్యాయంగా చనిపోయిన చిన్నారి రమ్య తరహా ఘటనలు తననెంతో
కలచివేస్తున్నాయన్నారు. భాగ్యనగరం ప్రస్తుతం డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుందని,
పబ్స్, క్లబ్స్ ఇలా ప్రతి ప్రదేశం డ్రగ్స్ అడ్డాగా మారిపోయాయని ఆమె ఆందోళన
చెందారు. మత్తులో కూలబడినవారిని బయటకు తీసుకెళ్లడానికి స్టెచర్లు, వీల్
చైర్స్‌ని కూడా పబ్స్‌లో ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని
విజయశాంతి చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఉద్యమకారిణిగా ముందుకు వచ్చిన తాను,
ఇప్పుడు ఈ డ్రగ్స్ నుంచి సమాజానికి విముక్తి కలిగించేందుకు ఉద్యమించాలని
భావిస్తున్నట్లు విజయశాంతి స్పష్టం చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ వాడకాన్ని
నిరసిస్తూ ‘ఉడ్తా పంజాబ్’ అనే సందేశాత్మక సినిమాని నిర్మించిన విషయాన్ని ఈ
సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో పెరిగిపోతున్న
మద్యం బాబుల ఆగడాలను ఎండగడుతూ అదే తరహాలో సినిమా తీయాలని... తాను లీడ్
రోల్‌లో అలాంటి చిత్రంలో నటించాలనుందని ఆమె తన మనసులోని మాట బయటపెట్టారు.
ఏదైతేనేం, చిరు సినిమాలో విజయశాంతి ప్రస్తుతానికి నటించడంలేదన్న విషయం...
సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ.... ఈ రెండు విషయాల్లో క్లారిటీ వచ్చేసినట్లే
అనిపిస్తోంది.

No comments:
Post a Comment