Wednesday, 13 July 2016

శక్తి ప్రదాయిని... దానిమ్మ!

వృద్ధాప్యాన్ని రానీయకుండా, నిత్య యవ్వనంతో కాంతులీనాలనుకుంటున్నారా? అయితే రోజూ దానిమ్మ పండును తినండి! వృద్ధాప్యాన్ని దూరంచేసే సుగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలోని కణజాలం బలహీనపడుతుంది. జీవకణంలో కీలకమైన అంగం.. మైటోకాండ్రియా! కణంలో శ్వాస నిశ్వాస ప్రక్రియ నిర్వహించడం, శక్తిని ప్రోదిచేయడం దీని పని. రాన్రాను ఈ వ్యవస్థ సత్తువ కోల్పోతుంది. ఫలితంగా జీవకణం గతమంత ఉత్తేజంగా ఉండలేదు. ఈ కారణంగానే యవ్వనంలో దేహదారుఢ్యంతో ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో కండలు కరిగి బలహీనంగా కనిపిస్తుంటారు. మైటోకాండ్రియాలు బలహీనపడటం వల్లే వణకు రోగం కూడా వస్తుందట! అయితే.. దానిమ్మ పండ్లలో ఉండే ‘యూరోలిథిన్‌ ఏ’ అనే పదార్థం జీవకణాల్లోని శక్తి కేంద్రాల పనితీరును ద్విగుణీకృతం చేస్తున్నట్లు తేలింది. ఇందుకు పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని ‘ఇకొలె పాలిటెక్నిక్‌ ఫెడరల్‌ డెలౌసనె -ఈపీఎఫ్‌ఎల్‌’ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు. ఎలుకలపై ప్రయోగాత్మకంగా పరీక్షించి మరీ సత్ఫలితాలు రాబట్టారు. ‘అమెజెనిటిస్‌’ అనే అంకుర సంస్థతో కలిసి వృద్ధాప్య సమస్యల పరిష్కారం దిశగా వీరు కృషిచేస్తున్నారు.

No comments:

Post a Comment