చదువు
రావాలంటే శిక్షించాలన్న ఆలోచన మనసుల్లో బాగా నాటుకుపోయింది. కొందరు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువుకొనే పిల్లలను తీవ్ర అసహనంతో
శిక్షిస్తున్నారు. దాని పరిణామాల తీవ్రతను పట్టించుకోవడం లేదు. ఆ చిన్నారుల
జీవితాలను అర్ధాంతరంగా చిదిమేస్తున్నారు. ఇటువంటి దుర్ఘటన మహారాష్ట్రలోని
బేలాపూర్ అనే గ్రామంలో జరిగింది. ఆరేళ్ళ అమాయకురాలి పాలిట ఆమె తండ్రే
కాలయముడయ్యాడు. ఈ నెల 9న జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం
తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ఒకటి
నుంచి 15 వరకు అంకెలను వరుసగా చెప్పలేకపోయినందుకు చిన్నారి తండ్రి ఆమె
నోట్లో ఉల్లిపాయ కుక్కాడు. ఆమెకు ఊపిరాడక ప్రాణాలొదిలితే గుట్టు చప్పుడు
కాకుండా గ్రామంలోని శ్మశానంలో అంత్యక్రియలు చేసేశారు. రెండు రోజుల తర్వాత ఆ
చిన్నారి తల్లి గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకుని పోలీసులకు తన భర్తపై
ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
సంజయ్
కూటే (32) కుమార్తె భారతి. ఆమెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకటో
తరగతిలో చేర్పించారు. సంజయ్ లేబర్‌గా పనిచేస్తూ ఉంటాడు. శనివారం రాత్రి తన
కుమార్తె ఎలా చదువుతోందోనని పరీక్ష చేశాడు. 1 నుంచి 15 వరకు అంకెలు
చెప్పమన్నాడు. ఆమె 12ను మరచిపోయింది. దీంతో సంజయ్ తీవ్ర ఆగ్రహంతో ఆమెను
చెంపదెబ్బ కొట్టాడు. చిన్నారి ఏడుస్తూ ఉండటంతో నోట్లో ఉల్లిపాయ కుక్కాడు.
దీంతో ఆ పాప ఊపిరాడక కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయింది. సంజయ్ ఆ బాలికను
సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు.

No comments:
Post a Comment