Wednesday, 13 July 2016

బాలికను రేప్ చేసి కిరాతంగా చంపేశాడు..

  • విద్యార్థినిపై హత్యాచారం
  • లారీ డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం
చెన్నై: చెన్నైలో పెనుదుమారం రేపిన ఐటీ ఉద్యోగిని స్వాతిని హతమార్చి పోలీసుల భయం వల్ల బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన రీతిలో శివగంగ జిల్లా మానామదురైలో ఓ కామాంధుడు బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను హతమార్చిన అనంతరం ఆత్మహత్యకు ఒడిగట్టాడు. మానామదురైలోని గణపతినగర్‌కు చెందిన కరుప్పయ్య, జయ దంపతుల కుమార్తె కాళీశ్వరి(11) మేల్‌నెట్టూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. భర్త చనిపోవడంతో జయ కూలిపనులు చేసుకుంటు కుమార్తెను చదివిస్తోంది. సోమవారం ఉదయం యధావిధిగా పాఠశాలకు వెళ్లిన కాళీశ్వరి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో జయ పాఠశాలలో విచారించింది. అయితే ఆమె ఇంటి సమీపంలో నివాసముంటున్న లారీ డ్రైవర్‌ కార్తీక్‌ (25) మోటార్‌ సైకిల్‌పై వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారు. వెంటనే జయ కార్తీక్‌ను సెల్‌ఫోన్లో సంప్రదించగా.. తానే కాళీశ్వరిని కిడ్నాప్‌ చేశానని, ఆమెను చంపేసి రహస్య ప్రదేశంలో పూడ్చి పెట్టానని కూడా చెప్పి ఫోన్ కట్‌ చేశాడు. దీంతో భయాందోళనలకు గురైన జయ మానామదురై పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌ కోసం గాలించారు.
 
             సాయంత్రానికి ఊరి బయట వున్న చెరువు గట్టున గొంతు కోసుకుని ప్రాణాపాయ స్థితిలో వున్న కార్తీక్‌ను గుర్తించిన పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో విషం బాటిల్‌, కత్తి వుండడంతో అతను ఆత్మహత్యకు యత్నించి వుంటాడని అనుమానిస్తున్నారు. రాత్రంతా బాలిక మృతదేహం కోసం గాలించిన పోలీసులకు మంగళవారం వేకువజామున 4 గంటలకు ఆమెను పూడ్చి పెట్టిన స్థలం కనిపించింది. అనంతరం భౌతికకాయాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కార్తీక్‌ కాళీశ్వరిపై అత్యాచారం జరిపి, ఆమె ఆ విషయాన్ని బయటకు చెబుతుందన్న భయంతో హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం కార్తీక్‌ తిరునల్వేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

No comments:

Post a Comment