గర్భిణులు వ్యాయామాలు
చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమనే అపోహ చాలామందిలో ఉంది.
అయితే గర్భిణులు నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల సి-సెక్షన్‌తో పనిలేకుండా
ప్రసవం హాయిగా జరిగిపోతుందట. అంతేకాదు జెస్టేషనల్ డయాబెటిస్ కూడా వారిలో
తలెత్తదట. శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
వ్యాయామాలు చేసే గర్భిణిల్లో 73 శాతం మందికి వజీనల్ డెలివరీ అవుతుండగా,
వ్యాయామాలు చేయని వారిలో వీరి సంఖ్య 67 శాతం ఉందని ఈ స్టడీలో తేలింది.
గర్భిణులు వ్యాయామాలు చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమనే భావన కూడా
వ్యాయామాలకు వారు దూరంగా ఉండడానికి కారణమని అధ్యయనకారులు చెబుతున్నారు.
అంతేకాదు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశం ఉందనే భయం కూడా ఉంది.
ఎందుకంటే వ్యాయామాలు చేయడం వల్ల నోరిపైన్‌ఫ్రైన్ అనే రసాయనం
విడుదలవుతుంది. దానివల్ల గర్భాశయంలో కదలికలు తీవ్రమై నెలలు నిండకుండానే
ప్రసవం జరుగుతుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నో అధ్యయనాల్లో గర్భిణికి
వ్యాయామాలు మంచే చేస్తాయి గాని హాని చేయవని తేలింది. శాస్త్రవేత్తలు చేసిన
ప్రస్తుత స్టడీలో కూడా అదే విషయం వెల్లడైంది. గర్భిణిలు వ్యాయామాలు చేయడం
వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిదని కూడా అధ్యయనకారులు
పేర్కొన్నారు. వ్యాయామాలు చేయడం వల్ల వారు సి-సెక్షన్ చేయించుకోనవసరం
లేకుండానే సహజ ప్రసవం జరుగుతుందిట. అంతేకాదు గర్భిణులు జెస్టేషనల్
డయాబెటిస్ బారిన పడే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. ఈ స్టడీలో 2,059 మంది
గర్భిణీలను పరీక్షించారు. వీరిలో సగంమంది రోజుకు 30-90 నిమిషాల పాటు వారంలో
నాలుగుసార్లు వ్యాయామాలు చేశారు. అలా పది వారాలు అంటే ప్రసవం అయ్యేవరకూ
వ్యాయామాలు చేశారు. ఇక మిగతా సగం మంది గర్భిణులు ఎలాంటి వ్యాయామాలు
చేయలేదు. వ్యాయామాలు చేయని వారిలో కంటే వ్యాయామాలు చేసిన గర్భిణులలో నెలలు
నిండకుండానే శిశువు జన్మించిన కేసులు పెరగలేదని తేలింది. వ్యాయామాలు చేసిన
వారిలో 17 శాతం మంది సి-సెక్షన్ చేయించుకుంటే, వ్యాయామాలు చేయనివారిలో
సి-సెక్షన్‌కు వెళ్లిన వారు 22 శాతంమంది ఉన్నారు. వ్యాయామాలు నిత్యం చేయడం
వల్ల గర్భిణుల్లో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గడంతోపాటు
రక్తపోటు తీవ్రత కూడా తక్కువ అవుతుందని వెల్లడైంది. సో....గర్భిణులకే కాదు
వారికి పుట్టబోయే పిల్లలకు కూడా వ్యాయామాలు ఎంతో మంచి చేస్తాయని
శాస్త్రవేత్తలు తేల్చారు.

No comments:
Post a Comment