Monday, 11 April 2016

కేరళలో ఘోర అగ్నిప్రమాదం...


- కొల్లం పుట్టింగల్‌ దేవి ఆలయం  వద్ద ఘోర అగ్నిప్రమాదం
- బాణాసంచా పేలుడుతో  తొక్కిసలాట
- 110మంది మృతి
- 400 మందికి గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- హుటాహుటిన సంఘటనా  స్థలానికి ప్రధాని
            కేరళలో ఘోరం జరిగింది. కొల్లంలోని వందేళ్ళనాటి పుట్టింగల్‌ అలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 110 మంది మృతి చెందారు. 400 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీనా భరణి వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో ఆలయం వద్ద కు చేరుకున్న భక్తుల్లో కొందరు బాణాసంచా కాల్చడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని భావిస్తున్నారు. ఆల య నిర్వాహకులు పెద్దఎత్తున నిలువ చేసిన బాణాసంచా దీనికి తోడుకావడంలో మంటలు దావానంలా మారాయి. భారీ శబ్ధాలు, పేలుళ్లు, ఒక్కసారిగా అగ్నికీలలను చూసి ఠారెత్తిన భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసి పెను విషాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే కేరళ ముఖ్యమంత్రితో పాటు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. దీనిపై కేరళ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.

            
తిరువనంతపురం : కేరళలో కొల్లాం జిల్లాలో కనీవిని ఎరుగని ఘోరం జరిగిపోయింది. కొల్లాం జిల్లా పర్వూర్‌ ప్రాంతంలోని వందేళ్ల చరిత్ర కలిగిన పుట్టింగల్‌ దేవి ఆలయ వేడుకల్లో భారీగా కాల్చిన బాణ సంచా వందలాది కుటుంబాల్లో చీకట్లను నింపింది.ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 110 మంది మృతి చెందగా, 400 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఆలయంలో జరుగుతున్న 'మీనా భరణి' వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘోరకలిపై కేరళ ప్రభుత్వం రిటైర్డు న్యాయమూర్తితో న్యాయవిచారణకు ఆదేశించింది. ఈ వేడుకల్లో ప్రతియేడు బాణాసంచా ప్రదర్శన, పోటి నిర్వహిస్తారు. ఈ సారి అనుమతి లేకున్నా ఆలయ కమిటీ, అధికారులు పోటీని నిర్వహించారు. ఇందుకోసం రూ. పది లక్షల బాణాసంచ తీసుకొచ్చి ఆలయం పక్కనే గల మైదానంలో భద్రపరిచారు. బాణాసంచా ప్రదర్శనను దాదాపు 10 వేల మంది భక్తులు తిలకిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచ భద్రపర్చిన చోట నిప్పు రవ్వలు పడడంతో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి మైదానంలోని రెండు భవనాలు సైతం కూలిపోయాయి. భయంతో భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం మరింత పెరిగింది. మృతదేహాలను, క్షతగాత్రులను త్రివేండ్రం మెడికల్‌ కళాశాల, కొల్లం జనరల్‌ ఆస్పత్రి సహ సమీపంలోని పది ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలకోసం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లను ఉపయోగించారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు
ఎలాంటి అనుమతులూ లేకున్నా బాణా సంచా ప్రదర్శన, పోటీ నిర్వహించారని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. రెండు లక్షలు, స్వల్ప గాయలైనవారికి రూ. 50 వేల ఎక్స్‌్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనపై జ్యుడీషియల్‌ విచారణకు చాందీ ఆదేశించారు. ఆలయ కమిటీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత ఆలయ అధికారులు కొందరు పారిపోవడం గమనార్హం.
ఘటనా స్థలాన్ని ప్రధాని సందర్శించారు. ప్రమాద వివరాలను ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీని అడిగి తెలుసుకున్నారు. కొల్లాంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నరేంద్ర మోడీ పరామర్శించారు. మోడీతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, కేరళ సీఎం ఉమెన్‌ చాందీ బాధితులను పరామర్శించారు. ఈ ఘటన హృదా యాన్ని కలిచి వేసిందని మోడీ అన్నారు. మాటల్లో చెప్పలేనంత బాధ అనుభవిస్తున్న బాధితుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రు లకు వైద్య సేవలందిం చేందుకు 15 మంది ప్రత్యేక వైద్యుల బృందం ప్రధానితో కేరళకు చేరుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, గాయపడిన వారికి అందుతున్న వైద్య సదుపాయాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యబృందంతో ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ ఘటనపై తొలుత ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరువాత వైద్య బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో తిరువనంతపురం చేరుకుని అక్కడ నుంచి సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారి కుటుంబానికి రూ.50,000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
మమ్మల్ని బెదిరించారు : పంకజాక్షి అమ్మ
పుట్టింగల్‌ దేవి ఆలయంలో బాణాసంచా ప్రదర్శనపై తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తమను ఆలయ అధికారులు బెదిరించారని పంకజాక్షి అమ్మ తెలిపారు. ఆమె ఫిర్యాదుతోనే జిల్లా కలెక్టర్‌ ఆలయ ప్రాంగణంలో బాణాసంచా ప్రదర్శనను నిషేదించారు. పుట్టింగల్‌ దేవి ఆలయానికి అతి సమీపంలోనే 80 ఏండ్ల పంకజాక్షి అమ్మ ఇల్లు ఉంది. పేలుడు ధాటికి ఆమె ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. పుట్టింగల్‌ దేవి ఆలయంలో బాణాసంచా ప్రదర్శన, పోటీపై పూర్తిగా నిషేదం విధించే వరకూ తాను పోరాడతానని పంకజాక్షి అమ్మ వెల్లడించారు.
రాష్ట్రపతి దిగ్భ్రాంతి
ప్రమాదం పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యకం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటాయని పేర్కొన్నారు.
చంద్రబాబు సంతాపం
కేరళలోని కొల్లం జిల్లా పుట్టింగల్‌ దేవి ఆలయంలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ దుర్ఘటన దురదృష్టకరమన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పవిత్ర దేవాలయంలో ఈ ప్రమాదం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

No comments:

Post a Comment