రేపు టీడీపీలోకి బొబ్బిలి రాజులు!
- వైసీపీని వీడనున్న ఎమ్మెల్యే సుజయ కృష్ణ
- ముఖ్య కార్యకర్తలతో కోటలో సమావేశం
బొబ్బిలి
రాజులు పార్టీ మారేందుకు సిద్ధ మయ్యారు. సీఎం చంద్రబాబు సమక్షంలో శుక్రవారం
టీడీపీలో చేరనున్నారు. కొంత కాలంగా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే
సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు, వైసీపీ శ్రీకాకుళం ఇనచార్జి బేబీ నాయన
పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది. బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ
కృష్ణ రంగారావు మూడుసార్లు గెలుపొందారు. తొలి రెండు విడతలు ఆయన అధికార
పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో
అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం జిల్లాకు చెందిన
బొత్స సత్యనారాయణే అని చెబుతారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి రాజులు కాంగ్రెస్
నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా
సుజయ కృష్ణ గెలుపొందారు. ఇటీవల బొత్స కూడా వైసీపీలోకి చేరడంతో బొబ్బిలి
రాజులు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే, జగన్
స్వయంగా జోక్యం చేసుకోవడంతో వారు పార్టీ మారే ఆలోచన విరమించుకున్నారు.
జిల్లాలో పార్టీ పరంగా బొత్స ఆధిపత్యం కొనసాగుతుండటంతో తాజాగా బొబ్బిలి
రాజులు టీడీపీలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో
బుధవారం నియోజకవర్గంలోని ప్రధాన నాయకులతో సుజయ కృష్ణ సోదరులు
సమావేశమయ్యారు. వైసీపీలో ఉన్న పరిస్థితిని సుజయ కృష్ణ రంగారావు
కార్యకర్తలకు వివరించి, తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, అంతా
సహకరించాలని కోరారు. దీనికి కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేయడంతో 15న
టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.
No comments:
Post a Comment