Monday, 18 April 2016

పెను భూకంపం...

ఈక్వెడార్‌లో పెను భూకంపం
నగరాలకు నగరాలే నేలమట్టం తీవ్రత 7.8గా నమోదు
  • రెప్పపాటులో కుప్పకూలిన భవనాలు
  • చివురుటాకుల్లా వణికిన ఆరు రాష్ర్టాలు
  • ప్రాణాలు గుప్పెట పట్టుకుని ప్రజల పరుగులు
        లాటిన్‌ అమెరికా దేశమైన ఈక్వెడార్‌.. భారీ భూకంపం ధాటికి చివురుటాకులా వణికిపోయింది. నగరాలకు నగరాలే నేలమట్టమయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో దేశంలోని ఆరు రాష్ర్టాల్లో భూమి నిమిషం పాటు కంపించింది. దీంతో పసిఫిక్‌ తీర ప్రాంతం మొత్తం నేల మట్టమైంది. కన్నుమూసి తెరిచేలోగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. రహదారులు ఎక్కడికక్కడ చీలిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. మాంటా, పెడెర్నలే నగరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లను వదిలి రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఈ ఘటనలో మొత్తం 233 మంది సజీవ సమాధి అయినట్టు దేశ అధ్యక్షుడు రఫాయెల్‌ కొరెయా తన అధికారిక ట్విటర్‌లో ప్రకటించారు. కనీవినీ ఎరుగని ఉత్పాతం సంభవించిన సమయంలో దేశ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్ని భవనాలు కూలినా నిర్మించుకోవచ్చని, కోల్పోయిన ప్రాణాలను మాత్రం తీసుకురాలేమని అన్నారు. ఘటన విషయం తెలియగానే.. వాటికన్‌ పర్యటనలో ఉన్న ఆయన.. తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన మాంటాకు బయలుదేరారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాదిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 
దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు, విపత్తు నిర్వహణ దళాలు.. భవన శిధిలాల్లో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు యత్నిస్తున్నాయి. ఈ భూకంపంలో కనీసం 1500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరింతమంది కూలిపోయిన భవన శిధిలాల్లో చిక్కుకుని ఉంటారని భావిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించామని స్థానిక టీవీకి ఇచ్చిన సందేశంలో దేశ ఉపాధ్యక్షుడు జార్జ్‌గ్లాస్‌ పేర్కొన్నారు. 1979 తర్వాత దేశ చరిత్రలో దీనిని కనీవినీ ఎరుగని ఉత్పాతంగా ఆయన పేర్కొన్నారు. రిక్టర్‌ స్కేల్‌పై 7.8గా నమోదైన ఈ భూకంపం.. రాజధాని క్విటోకు 170 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూకంపంతో అతలాకుతలమైన ప్రావిన్స్‌లలో ఎమర్జెన్సీ విధించినట్టు ఉపాధ్యక్షుడు తెలిపారు. మాంటా, పోర్టోవీజో, గ్వాయాక్విల్‌ ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
 
ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతం పర్యాటక ప్రాంతమని, ముఖ్యంగా ఫిషింగ్‌ పోర్టుగా అభివృద్ధి చెందిందని అయితే ఇప్పుడు రూపు రేఖలు కూడా గుర్తించేందుకు వీలు లేకుండా పోయిందని జార్జ్‌ అన్నారు. పెడెర్నలే ప్రాంతం మొత్తం కుప్పకూలిందని, ఇక్కడి 40 వేల మంది ప్రజలూ భూకంపం ధాటికి ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదకి పరుగులు పెట్టారని ఈ ప్రాంత మేయర్‌ గాబ్రియెల్‌ ఆల్‌సివార్‌ తెలిపారు. కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ‘‘ఇక్కడ ఏ ఒక్క ఇల్లో కూలిపోలేదు.
 
మొత్తం నగరమంతా కుప్పకూలింది’’ అని గాబ్రియెల్‌ చెప్పారు. ఇక, బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు హోరెత్తాయి. వందల సంఖ్యలో బాధితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అధికారులు ఎక్కడికక్కడ తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేశారు. ఆహారం, తాగు నీరును భారీగా సరఫరా చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ కూడా కుప్పకూలింది.

No comments:

Post a Comment