Friday, 22 April 2016

మన దేశంలోనూ రోబో కార్మికులు...

రోబో గార్డ్స్‌...
రోబోల తయారీపై దృష్టిపెట్టిన దేశీయ కంపెనీలు
రంగంలోకి ముందుకొస్తున్న అంకుర పరిశ్రమలు
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేదోడు



వెల్డింగ్‌ చేయడం ప్రమాదంతో కూడుకున్నదని, గ్యాస్‌ వాసన భరించలేకపోతున్నామంటుంటారు సంబంధిత కార్మికులు. కంట్లో నిప్పురవ్వలు పడతాయన్న భయమూ ఉంటుంది. మార్కెట్‌లో వెల్డింగ్‌ పనులు చేసే సుశిక్షుతులైన మానవ వనరులు అందుబాటులో లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభించనుంది. చిన్నచిన్న వెల్డింగ్‌ పనుల్ని రోబోలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఆటోమేషన్‌ త్వరలో మన దేశంలోనూ విస్తరించనుంది.

షాపింగ్‌ మాల్‌లో సబ్బులు, ఇతర వస్తువులను ఒక క్రమపద్ధతిలో పెట్టాలా? ఈ పనికి భవిష్యత్తులో మానవ వనరుల అవసరం ఇక ఉండదు. కౌంటర్‌లో యజమాని సీట్లో కూర్చుని ఇచ్చే ఆదేశాలతో ఆయా పనులన్నీ జరిగిపోనున్నాయి. దేశీయంగా తక్కువ ధరలకే రోబోలను ఉత్పత్తి చేసేందుకు ప్రఖ్యాత సంస్థలు నిమగ్నమయ్యాయి. భవిష్యత్తు తరమంతా రోబోలమయం కానుంది.
రోబోల తయారీ అంటే ఇప్పటి వరకు జపాన్‌, చైనా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని సంస్థలదే పైచేయిగా ఉంది. ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన రోబోలు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ వాటాను ఆక్రమించాయి. భారత్‌లో కొన్ని రోబో తయారీ సంస్థలున్నా, అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన సంస్థల భాగస్వామ్యంలో ఏర్పాటు చేసినవే. తాజాగా రోబోలకు భారత మార్కెట్‌లో విస్తృత డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇక్కడి అవసరాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రోబోలను తయారు చేసేందుకు పలు అంకుర సంస్థలు(స్టార్టప్‌) ముందుకు వస్తున్నాయి. రోబోల తయారీ రంగంలో పెట్టుబడులకు భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో తయారీ(మేక్‌ ఇన్‌ ఇండియా)కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున దేశీయంగా తయారు చేసే రోబోలకు ప్రాముఖ్యం ఉండనుంది. ఈ క్రమంలో దేశీయ తయారీ రోబోలకు అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఉండనుంది. అయినప్పటికీ విదేశీ సంస్థల నుంచి పోటీని తట్టుకుని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాతే రోబోల్ని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని అంకుర సంస్థలు ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక అవసరాల కోసం చిన్న రోబోలు మార్కెట్‌లోకి రానున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలు తీర్చేలా ఈ రోబోలు ఉండనున్నాయి. ఇప్పటికే వెల్డింగ్‌, బరువులు ఎత్తడం, చిన్న పరిశ్రమల్లో పనులు చేయడం తదితర అవసరాల కోసం నమూనాలు సిద్ధమవుతున్నాయి. ఆటోమేటెడ్‌ పనుల కోసం దేశీయంగా ప్రతిఏటా కనీసం 1,000 భారీ రోబోలు అవసరం. అంతర్జాతీయంగా ఈ డిమాండ్‌ 5వేల వరకు ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ డిమాండ్‌ పదింతలు కానుంది. దేశీయ రోబో ‘బ్రాబో’: ప్రస్తుతం టాటా సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన రోబోలను బ్రాబో పేరిట ఉత్పత్తి చేయనుంది. దేశీయ అవసరాల కోసం ఆటోమేషన్‌లో భాగంగా త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇటీవల ముంబయిలో భారీ ఎత్తున జరిగిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో టాటా తన ‘బ్రాబో’ను ప్రదర్శనకు ఉంచింది. ఒక్కో రోబో ఖరీదు రూ.3 లక్షలుగా ఉంది. ఇది 2 కిలోల బరువు పనులు చేస్తుంది. రూ.6 లక్షల ఖరీదైన మరో రోబో కనీసం 10 కిలోల బరువున్న పనులు చేస్తుంది.
ఇళ్లు కూడా శుభ్రం చేస్తాయి
* గృహాల్లో ఇళ్లు శుభ్రం చేయడం, వస్తువులను అందించడం వంటి చిన్న చిన్న పనులు చేసేందుకు రోబోలు అందుబాటులోకి వచ్చాయి.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో మనుషులు చేసే పనుల్ని రోబోలే పూర్తిచేస్తాయి.
* ప్రస్తుతం సూక్ష్మ పరిశ్రమల్లో బోల్టులు బిగించడం, వెల్డింగ్‌ చేయడం, బరువులు ఎత్తడం, ఒక క్రమపద్ధతిలో పేర్చడం లాంటి పనులు చేసే రోబోలులు వచ్చాయి.
* రోబోలు చేసే పనుల్లో లోపాలు ఉండవు. కంప్యూటర్‌లో రాసిన ప్రోగ్రామ్‌ ఆధారంగా రోబోలు పనిచేస్తుంటాయి. దీంతో తయారీరంగంలో లోపాలు ఉండవు.
* వైద్యరంగంలో కొన్ని కీలకమైన ఆపరేషన్లు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. భవిష్యత్తులో వీటి వినియోగం మరింత పెరుగుతుంది.
* రక్షణ రంగ అవసరాల కోసం మానవ రహిత విమానాలు, ట్యాంకులు రోబోల సహాయంతో యుద్ధాలు చేయడం లాంటి ఆలోచనలున్నాయి. ఇప్పటికే డీఆర్‌డీవో ఈ దిశగా పరిశోధనలు మొదలుపెట్టింది. అమెరికా లాంటి దేశాలు రోబోలను రక్షణ, భద్రత విభాగాల్లో ప్రవేశపెట్టాయి.
* సగానికి తగ్గనున్న మానవ వినియోగం
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రోబోలు సేవలందిస్తే రానున్న 30 ఏళ్లలో ప్రస్తుతమున్న మానవ వనరుల వినియోగం సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా. గోదాముల్లో ఇప్పటికే రోబోలు పనిచేస్తున్నాయి. అమెజాన్‌ లాంటి సంస్థలు రోబోల సహాయంతో వస్తువుల్ని ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తున్నాయి.


                           రోబో గార్డ్స్‌..
 


     చేతిలో డబ్బు ఉందంటే.. చుట్టూ నలుగురు మనుషులు.. విలాసవంతమైన కార్లు కామనే. షాపింగ్‌ చేసినా.. ఎక్కడికెళ్లినా ఏ కష్టం లేకుండా చుట్టూ ఉన్న వారే చూసుకుంటారు. అయితే.. చైనాలోని ఓ కోటీశ్వరుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. అందరిలా కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ.. చుట్టూ నలుగురు మనుషులను కాకుండా ఎనిమిది రోబోలను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇంతకీ.. ఆ రోబోలు ఎందుకు అనుకుంటున్నారా? కేవలం అతను షాపింగ్‌ చేసిన వస్తువులను మోసుకెళ్లడానికేనట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. రోబోలతో షాపింగ్‌ చేస్తూ అందరినీ విస్మయపరుస్తున్నాడు.ఇటీవలే రోబోలతో కలిసి బంగారు ఆభరణాలు కొనడానికి వెళ్లిన అతగాడిని చూసి.. జువెలరీ షాప్‌ సిబ్బంది ఆశ్చర్యపోయారట. అమ్మాయిల దుస్తుల్లో ఉన్న ఆ రోబోలు.. అతను కొన్న వస్తువులను తీసుకొని నడిచి వెళుతుంటే అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టి చూశారట.
చైనాలో షాపింగ్‌ మాల్స్‌.. రెస్టారెంట్లు ఇలా ఎక్కడ చూసినా హ్యూమనాయిడ్‌ రోబోలే కనిపిస్తున్నాయి. కానీ.. ఇలా ఓ వ్యక్తికి సాయం చేయడానికే 8 రోబోలు పనిచేయడాన్ని మాత్రం విచిత్రంగా ఉంది.
 

No comments:

Post a Comment