Saturday, 16 April 2016

భవన నిర్మాణాల కోసం కొత్త నిబంధనలు...

  • కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రూపకల్పన
  • ప్రత్యేక పర్యావరణ అనుమతుల్లేకుండా చర్యలు
  • విద్యుత్ ఆదా అయ్యేలా ప్రణాళికలు
  • త్వరంలో ఉత్తర్వులు విడుదల
  • ఈ రూల్స్‌ సీఆర్‌డీఏకు వర్తించవు
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో భవన నిర్మాణాల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సమగ్రమైన బిల్డింగ్‌ ప్లాన ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘మోడల్‌ బిల్డింగ్‌ బైలాస్’ను రూపొందించింది. దాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ మున్సిపల్‌ శాఖ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్‌ రూల్స్‌-2016ను సిద్దం చేసింది. రేపో, మాపో కొత్త నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది. భవన నిర్మాణ అనుమతులు సరళతరం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం చొరవ చూపడంతో మన రాష్ట్రంలో దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పమెంట్‌ అథారిటీలు, అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, మాస్టర్‌ ప్లాన్/సాధారణ టౌన్ ప్లానింగ్‌ స్కీంలో ఉన్న గ్రామ పంచాయతీ ఏరియాలో భవన నిర్మాణ కార్యక్రమాలు క్రమబద్ధీకరించేందుకు కొత్త రూల్స్‌ను రూపొందించారు. అయితే ఈ నిబంధనలు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని ప్రాంతాలకు వర్తించవు.
 
కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ రూపొందించిన మోడల్‌ బైలాస్‌ చాప్టర్‌ 13, 14లో పేర్కొన్నట్లు భవన నిర్మాణ అనుమతులు సరళతరం చేసేందుకు.. పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకుండా పట్టణ స్థానిక సంస్థల బిల్డింగ్‌ప్లానలో రూల్స్‌ పొందుపరించారు. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశకు ప్రత్యేకంగా బిల్డింగ్‌ రూల్స్‌ను ప్రతిపాదిస్తూ గతంలో ఇచ్చిన జీవోకు సవరణలు చేపడతారు. సమగ్రమైన అభివృద్ధి పరమావధిగా, విద్యుత వినియోగం తగ్గించుకునేలా భవన నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.
 
మాస్టర్‌ప్లాన్/జోనల్‌ప్లానలోని భూవినియోగం, కవరేజ్‌, సెట్‌బ్యాక్‌, ఎత్తు, స్టోరేజ్‌ సంఖ్య, నివసిస్తున్న భవనాల సంఖ్య, పార్కింగ్‌ ప్రమాణాల తదితర కేటగిరీకి చెందినవన్నీ ఎప్పటికప్పుడు సవరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశ మందిరాలకు, రిక్రియేషన్, సాంఘిక మతపరమైన, రెస్టారెంట్లు, ఈటింగ్‌ లేక బోర్డింగ్‌ హౌస్‌, క్లబ్‌లు, జింఖానా, రోడ్లు, రైల్వే, ఎయిర్‌, సముద్రం ఇతర పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్ స్టేషన్లు తదితరాలను అసెంబ్లీ బిల్డింగ్స్‌గా పేర్కొంటూ రూల్స్‌ను తయారుచేశారు. విద్యుత ఆదా చేసేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ-2007 ప్రకారం కనీస చర్యలు తీసుకోనున్నారు. ఇందు కోసం ఎనర్టీ కన్జర్వేషన్ బిల్డింగ్‌ కోడ్‌ను అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఇంటి అభివృద్ధికి సంబంధించి గేటెడ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కింద కాంపౌండ్‌ వాల్‌, గ్రూప్‌ డెవలప్‌మెంట్‌ స్కీం, గ్రూప్‌ హౌసింగ్‌, బిల్డింగ్‌ ఎత్తు, ఎక్కువ ఎత్తు బిల్డింగ్‌ల ఆనుమతికి విధివిధానాలు రూపొందించారు. మెట్రోపాలిటన్లకు మంజూరు అథారిటీలుగా మెట్రోపాలిటన్ కమిషనర్లు, అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు వీసీఎండీలు, పట్టణ స్థానిక సంస్థలకు కమిషనర్లు, గ్రామపంచాయతీలకు ఎగ్జిక్యూటివ్‌ అధికారులు ఉంటారు.
 
ఒక్కో అంశానికి ఒక్కో ఫాం
ఎవరైనా భవన నిర్మాణాలకు, పునర్నిర్మాణానికి, మార్పులు చేర్పులకు అనుమతులు కావాలంటే సంబంధిత అధికారులకు ఫాం ఏ-1 నోటీసులివ్వాలి. ఈ నోటీసుతో పాటు ఆరు కాపీల ప్లానలు, స్టేట్‌మెంట్లు జతచేయాలి. రోడ్డు విస్తరణ కోసం స్థలం స్వాధీనం చేసేందుకు అఫిడవిట్‌ను ఫాం ఏ-2, అర్బన్ ల్యాండ్‌ సీలింగ్‌ అమలయ్యే చోట ఫాం ఏ-3, సెల్లార్‌ నిర్మాణాలకు ఫాం ఏ-4, అవసరమైన మొత్తం కోసం నాన జ్యుడీషియల్‌ స్టాంపుపై ఫాం ఏ-5 సమర్పించాలి. అగ్నిమాపకశాఖ చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ అండ్‌ డీజీ అనుమతి తీసుకోవాలి. లేఅవుట్లు/సబ్‌డివిజన్లు అభివృద్ధి పనుల కోసం ఫాం ఏ-1తోపాటు ప్లానలు జతచేయాలి. డ్రైనేజీలు, పారిశుధ్యం పనులకు సంబంధించి పర్యవేక్షణ, నిర్వహణకు సంబంధిత ఫాంపై ఆర్కిటెక్ట్‌/ ఇంజనీర్‌/ సూపర్‌వైజర్‌ ద్వారా ధ్రువీకరణ ఇవ్వాలి. భవన యజమాని లేక డెవలపర్‌ భవన నిర్మాణ ప్లానను ధిక్కరించబోమని అఫిడవిట్‌ ఇవ్వాలి. అపార్ట్‌మెంట్ల యజమానులు తాము నిర్మించిన అన్నీ అంతస్తుల్లో నిబంధనలు అతిక్రమించబోమని డిక్లరేషన ఇవ్వాలి. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి, రెండో అంతస్తుల్లో ఏదో ఒక దానిలో 10%, వరుస ఇళ్లకైతే 5% నిర్మిత ప్రాంతాన్ని అప్పగిస్తూ నోటరీ చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలి. ఆ మేరకు ఈ ఆస్తి ప్రొహిబిటరీ ప్రాపర్టీస్‌గా రిజిస్ట్రేషన్ శాఖ రక్షణలో ఉంటుంది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్లలో 200 చ.మీ స్థలంలో 10 మీటర్లు ఎత్తు, మున్సిపాలిటీ/నగరపంచాయతీల్లో 300 చ.మీల స్థలంలో 10 మీటర్లు ఎత్తు నిర్మించే వ్యక్తిగత భవన నిర్మాణాలకు ఇలాంటి డిక్లరేషన్లు అవసరం లేదని రూల్స్‌లో పేర్కొన్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న భవన యజమానికి అనుమతి ఇస్తున్నారో లేదో 90 రోజుల్లోపు రాతపూర్వకంగా సంబంధిత అధికారులు తెలియజేయాలి. భవన నిర్మాణ అనుమతి పొందిన 18 నెలల్లోపు నిర్మాణాలు ప్రారంభించాలి. పనులు ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారికి ఫాం ఏ-6ను ఇవ్వాలి. అనుమతి పొందిన భవన నిర్మాణం పూర్తయ్యాక ఫాం ఏ-10 నోటీసులు సంబంధిత అధికారికి ఇవ్వాలి.

No comments:

Post a Comment