Monday, 11 April 2016

112కు పెరిగిన మృతుల సంఖ్య...కొల్లం ఘటనలో ఐదుగురి అరెస్టు

కేరళ ఆలయం విషాదానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కొల్లంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. ఆలయం వద్ద ఎటు చూసినా విషాదం తాండవిస్తుంది. పుట్టింగళ్‌ ఆలయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వందల కుటుంబాల్లో కన్నీరు నింపింది. బాణా సంచా కాల్చే సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. పక్కనే బాణా సంచా నిలువ చేసిన రెండంతస్తుల భవనంపై నిప్పు రవ్వలు పడడంతో అర కిలోమీటరు పరిధిలో సర్వం బుగ్గిపాలైంది. ఆ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
ప్రమాదం జరిగే సమయంలో ఆలయ ప్రాంగణంలో 15 వేల మంది భక్తులు వేడుకలు చూస్తున్నారు. ప్రమాద తీవ్రతకు 2 కిలోమీటర్ల దూరంలోని ఒక షోరూమ్‌ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న ఐదుగురిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాణా సంచా కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. పుట్టంగళ్‌ ఆలయంలోని ఘటనా స్థలాన్ని దర్యాప్తు బృందం సందర్శించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలో అనేక కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బాణా సంచా పోటీలకు అనుమతి లేదు. ఆలయానికి సమీపంలో నివసించే పంకజాక్షి అమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు ఆ పోటీలపై నిషేధం విధించారు. నిషేధం ఉన్నప్పటికీ ఆదివారం (10వతేదీ) తెల్లవారుజామున బాణా సంచా పోటీలు నిర్వహించారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పంకజాక్షి అమ్మ ఇల్లు కూడా దెబ్బతిన్నది. ఈ ప్రమాదానికి పూర్తిగా మానవ తప్పిదమనే కారణమని తెలుస్తోంది.

No comments:

Post a Comment