గాలిలోని తేమ నుంచి తాగునీటిని సృష్టించే పరికరం
గంటకు అర లీటరు నీరు తయారీ
ఆస్ట్రియా పరిశోధకుడి అద్భుత ఆవిష్కరణ
ఎలా పనిచేస్తుంది..
రిఫ్రిజిరేటర్‌లో బాగా చల్లబడిన ఒక పాత్రను కానీ, సీసాను కానీ బయటకు తీసి సాధారణ వాతావరణంలో కొద్దిసేపు ఉంచితే దాని ఉపరితల గోడల నుంచి బొట్లుబొట్లుగా నీరు కారుతుంది. ఆ తరహాలోనే సాంద్రీకరణ(కండెన్సేషన్) విధానంలో ఇది పనిచేస్తుంది. ఈ పరికరం గాలిలో ఉన్న తేమ నుంచి నీటిని సంగ్రహిస్తుంది. సౌర శక్తితో పనిచేసే ఈ పరికరానికి ఫోంటస్ అని పేరు పెట్టారు. ఇందులో ఒక సాంద్రీకరణి(కండెన్సేటర్) ఉంటుంది. నీటిని త్యజించే ఇంకొన్ని భాగాలుంటాయి. తామరాకులా పనిచేసే ఆ భాగాలకు నీరు అంటుకోదు. అలాంటి భాగాలకు సాంద్రీకరణిని అనుసంధానిస్తారు. ఫోంటస్ పరికరాన్ని గాలిలో ఉంచగానే సాంద్రీకరణి వల్ల నీటిని త్యజించే భాగాలన్నీ చల్లగా మారి కొద్దిసేపటికి నీటి బొట్లను ఏర్పరుస్తాయి. ఆ వెంటనే వాటిని తమ నుంచి తొలగించుకుంటాయి. అలా తొలగిన నీరు సీసాలో చేరుతుంది. ఇది పూర్తిగా శుద్ధమైన నీరు.. దీన్ని తాగొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి ఆవిరిని ఒడిసి పట్టి నీరుగా మార్చుకునే ప్రక్రియ ఇది.
30 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో గంట సమయంలో ఈ ఫోంటస్ పరికరం అర లీటరు నీటిని తయారుచేస్తుంది. ‘‘భూమి మీద ఎక్కడున్నా కూడా గాలిలో ఎంతోకొంత తేమ ఉంటుంది. చివరకు ఎడారిలో కూడా గాలిలో తేమ ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ పరికరం నీటిని తయారుచేయగలదు’’ అని దీన్ని రూపొందించిన రెటిజర్ చెబుతున్నారు. సీసాలోకి దుమ్ముధూళి చేరకుండా దీనికి ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది. అయితే... బాగా కలుషితమైన గాలిలో అయితే, నీటి స్వచ్ఛతను అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి కార్బన్ ఫిల్టర్‌ను కూడా దీనికి అమర్చుకోవచ్చని రెటిజర్ చెబుతున్నారు. ఏడాదిలోగా దీన్ని ప్రపంచానికి అందించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ ఫోంటస్ సీసాను ద్విచక్రవాహనాలు, సైకిళ్లకు అమర్చుకుంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణ సమయంలోనే నీరు తయారువుతుంటుంది. దాహం తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment