Thursday, 14 April 2016

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌!

  1. గులాబీ గూటికి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 
  2. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్‌  
  3. ఎవరి ఒత్తిడీ లేదు: రామ్మోహన్ రెడ్డి  
  4. సోదరి డీకే అరుణతో రాజకీయ కటీఫ్‌

                    హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌! ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కారెక్కేశారు. మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు, మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి వెంట మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మక్తల్‌ టీఆర్‌ఎస్‌ ఇనచార్జి దేవర మల్లప్ప ఉన్నా రు. దాదాపు రెండు గంటల పాటు సీఎం వద్ద వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం చిట్టెం రామ్మోహనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మక్త ల్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్టు స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని.. స్వచ్ఛందంగానే టీఆర్‌ఎ్‌సలో చేరానని వివరించారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న వివిధ అభివృద్ది పనులు, ప్రాజెక్టులు చూసి ఆకర్షితుడినయ్యానని చెప్పారు. గతంలోనూ తాను టీఆర్‌ఎ్‌సపై ఏ విధమైన విమర్శలు చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 
            మహబూబ్‌నగర్‌ జిల్లాకు సీఎం ఎన్నో పథకాలు ఇస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టు వల్ల నీటి సమస్య లు తీరతాయని భావిస్తున్నట్టు చిట్టెం చెప్పారు. మీ సోదరి ఎమ్మెల్యే డీకే అరుణ కూడా టీఆర్‌ఎ్‌సలో చేరుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆమె టీఆర్‌ఎ్‌సలోకి రాదని చిట్టెం సమాధానమిచ్చారు. ‘‘ఆమె రాజకీయ వేరు. నా రాజకీయం వేరు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సం దర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలోకి వచ్చి చేరుతున్నారని అన్నారు. అంతేతప్ప తాము ఏ పార్టీనీ టార్గెట్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం తెలంగాణ అభివృద్ధికి వివిధ ప్రాజెక్టులు, ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నారని చెప్పారు.

చిట్టెం పొరపాటు చేస్తారని అనుకోలేదు: చిన్నారెడ్డి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌: దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డికి పాలమూరు జిల్లాలో ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదని, ఆయన కొడుకుగా రామ్మోహన్‌రెడ్డి పార్టీని వీడి పొరపాటు చేస్తారని తాను ఊహించలేదని వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. చిట్టెం నర్సిరెడ్డి చిత్తశుద్ధి ఉన్న నాయకుడని, భీమా ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లిన చరిత్ర ఉన్నదని, అలాంటి వ్యక్తి కొడుకుగా రామ్మోహన్‌రెడ్డి.. పార్టీని వీడి టీఆర్‌ఎ్‌సలో చేరడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతున్నదని, గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ అయిపోతుందనుకోవడం పొరపాటేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని, కేసీఆర్‌ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.


11 ఏళ్ల అక్కా తమ్ముడి రాజకీయ బంధానికి తెర
ఊహాగానాలకు తెరదించుతూ మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం టీఆర్‌ఎ్‌సలో చేరారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి 2004లో నక్సల్స్‌ కాల్పుల్లో మరణించడంతో రామ్మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. ఆతర్వాత 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని 11 వే ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో మక్తల్‌ నుంచి విజయం సాధించారు. మక్తల్‌ నియోజకవర్గంలో మొదటినుంచి రాజకీయ ప్రాబల్యం గల కుటుంబంగా వీరికి పేరుంది. తన సోదరి డీకే అరుణతో కలిసి దాదాపు 11 సంవత్సరాల పాటు ఒకేమాట, ఒకే బాటగా చిట్టెం తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. తాజాగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కాతమ్ముడి రాజకీయ అనుబంధానికి తెరపడింది.

No comments:

Post a Comment