మండు
వేసవి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆహార పదార్థల విషయంలో జాగ్రత్తలు
తీసుకోకపోతే ఆరోగ్యానికి చేటే. ముఖ్యంగా ఈ సీజన్‌లో లభించే పండ్ల విషయంలో
చాలా అవగాహన అవసరం. ఎర్రగా చూడగానే నోరూరేలా కనిపిస్తున్నాయి కదా అని...
కొనుగోలు చేసి తింటే రోగం తప్పదు. అమ్మకాలు పెంచుకునేందుకు పక్వానికి
రాకుండానే రసాయనాలతో మగ్గబెట్టి ప్రజలకు కొంతమంది వ్యాపారులు
అంటగడుతున్నారు. పండ్లు కొనుగోలు చేసినప్పుడు అవి పక్వానికి వచ్చాయా?
లేకుంటే రసాయనాలు వాడారా? అన్న విషయాన్ని గమనించి కొనుగోలు చేయాలని
నిపుణులు సూచిస్తున్నారు.
మామిడి పండు ఎర్రగా
ఉందని ఆశపడి కొనుగోలు చేస్తే రోగం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పండును రంగు చూసి కొనుగోలు చేయకుండా... అసలు పండు పక్వానికి వచ్చిందో లేదో
పరిశీలించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ను
మామిడిపండ్లు ముంచెత్తుతున్నాయి. మార్కెట్‌లో లభ్యమవుతున్న మామిడిపండ్లు
మేడి పండు చందంగానే కనిపిస్తున్నాయి. వీటి రంగును చూస్తే నోరూరిస్తున్నాయి.
దీంతో వినియోగదారులు వెనుకాముందు చూడకుండా వీటి కొనుగోలుకు ప్రాధాన్యం
ఇస్తున్నారు. మామిడికాయ పక్వానికి రావాలంటే సుమారు 100 నుంచి 120 రోజులు
వరకూ పడుతుంది. అయితే ఈదురుగాలులకు నేల రాలిన మామిడికాయలను రసాయనాలను
ఉపయోగించి వ్యాపారులు కృత్రిమంగా పండిస్తుంటారు. అలాగే ముందస్తుగా
మార్కెట్‌లోకి పక్వానికి రాని కాయలను కోసి రసాయనాలను వినియోగించి అమ్మకాలకు
సిద్ధం చేస్తారు. ఈ పళ్లను తినడంతో అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని
వైద్యులు పేర్కొంటున్నారు. ఏటా జనవరి మొదటివారం నుంచి మామిడిపూత
మొదలవుతుంది. ఈ ఏడాది కూడా సమయానికి మామిడిపూత వచ్చినప్పటికీ... అనావృష్టి,
మంచు దెబ్బతో పూత పాడైంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పువ్వు, పిందె
కనిపించింది. అంటే కాయ పక్వానికి రావాలంటే మే నెల చివరకు గానీ రైతుల
దరిచేరదు. అయితే పక్వ దశకు చేరకుండానే మామిడిపళ్లను రసాయనాలు ఉపయోగించి
వ్యాపారులు పండిస్తున్నారు.
రంగు కోసం రసాయనాలు
మామిడి
పండ్లను మంచి రంగులోకి మార్చి అధిక లాభాలను ఆర్జించాలనే ఉద్దేశ్యంతో
వ్యాపారులు పక్వానికి రాని మామిడికాయలపై వివిధ రసాయనాలను
ప్రయోగిస్తున్నారు. అయితే ఆ పళ్లను కొనుగోలు చేసి వినియోగదారులు అనారోగాలకు
గురవుతున్నారు. మామిడి పళ్లకు చూడముచ్చటైన రంగు కోసం కాల్షి యంను, కాయ
పక్వానికి వచ్చేందుకు ఈథిలిన్ రసాయాన్ని వినియోగిస్తున్నారు. దీంతో అవి
పూర్తి పక్వ దశకు వచ్చిన మామిడిపండ్లు లాగానే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా
సపోట, బొప్పాయి, అరటి వంటి పళ్లను పండించేందుకు కూడా వ్యాపారులు ఈ
రసాయనాలను వినియోగిస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రభావం
కాల్షియం,
ఈథిలిన్ వంటి రసాయనాలను వినియోగించడంతో ఉదరకోశ వ్యాధులు, అజీర్ణం వంటి
సమస్య లు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పండ్లను ఎక్కువుగా తీసుకోవడంతో అవి మానవ శరీరానికి విటమిన్లు, పోషక విలువలు
పెంపొందించుకోవచ్చు అనే మాట ఎలా ఉన్నా నేటి రోజుల్లో మాత్రం ఇటువంటి
రసాయనాలు వినియోగించే పండ్లను తినడంతో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు
మెండుగా ఉన్నాయని వైద్యులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా?
మామిడికాయలను
కృత్రిమ పద్దతిలో మాగబెట్టేందుకు వినియోగిస్తున్న ప్రమాదకరమైన రసాయనాలను
వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్నారని, వీటిని నియంత్రించాలని
హైకోర్టు ఆదేశించింది. పండ్లు పక్వానికి రాకుండా రసాయనాలను వినియోగించి
కృత్రిమంగా పండిస్తున్న వ్యాపారులపై కొరడా ఝులిపించాలని ఆదేశించింది. గతంలో
కూడా హైకోర్టు చొరవ తీసుకోవడంతో ఆయావిభాగాల అధికారులు హడావుడి చేసి చేతులు
దులుపుకున్నారు. యథావిధిగానే వ్యాపారులు తమ కార్యకలాపాలను
కొనసాగిస్తున్నారు. ఒక్క మామిడికాయపైనే కాకుండా వివిధ రకాల పండ్ల రకాలను
కృత్రిమంగా పండించేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలను పూర్తిస్థాయిలో
అధికార యంత్రాంగం అడ్డుకోవల్సి ఉంది. లేనిపక్షంలో వీటి ప్రభావం మానవాళిపై
తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించనుంది.

No comments:
Post a Comment