Friday, 22 April 2016

బాబా హుండీలో వజ్రాలు..!

షిర్డీసాయి హుండీలో రూ.85 లక్షల వజ్రాలు 

షిర్డీ (మహారాష్ట్ర) : షిర్డీ సాయిబాబా ఆలయంలోని డొనేషన్ల హుండీలో విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. అజ్ఞాత భక్తులు ఎవరో వజ్రాలను ఒక ప్యాకెట్‌లో చుట్టి హుండీలో వేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. సహజంగా ఇంత భారీ విలువల కలిగిన డొనేషన్లను నేరుగా ట్రస్టీలకు అందజేస్తుంటారు. అందుకు భిన్నంగా హుండీలో వజ్రాలు కనిపించడం టెంపుల్ ట్రస్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాటి విలువ ఎంతో తెలియకపోవడంతో అధికారులు ముంబై నుంచి ముగ్గురు జ్యువెలరీ డిజైనర్లను రప్పించి ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. వారు ఆ వజ్రాల విలువను లెక్కకట్టి రూ.85 లక్షల వరకూ ఉంటుందని తేల్చారు. మొదట్లో ఈ వజ్రాలను చూసినప్పుడు అంత ఖరీదైనవి కావని అనుకున్నప్పటికీ పరీక్షించి చూశాక అవి విలువైనవని తెలిసినట్టు ప్యానల్ సభ్యులలో ఒకరైన ఆభరణాల వ్యాపారి నరేష్ మెహతా తెలిపారు. వజ్రాల్లో ఒకటి 6.67 క్యారెట్లు (బ్రిలియెంట్ కట్), మరొకటి 2.50 క్యారెట్లు (ఎమరాల్డ్ కట్) కలిగి ఉన్నాయన్నారు. మొత్తంగా వాటి విలువ రూ.85 లక్షల రూపాయలని తెలిపారు. కాగా, ఆ వజ్రాలను ఏం చేయాలనే దానిపై ఆలయ అధికారులు నేరుగా ముంబై హైకోర్టును సంప్రదిస్తున్నారు. షిర్డీ ఆలయంలోని డొనేషన్ బాక్సులను ప్రతిరోజూ లెక్కించి నగదు, నాణేలను ట్రెజరీలో డిపాజిట్ చేస్తుంటారు.

No comments:

Post a Comment