Friday, 22 April 2016

హనుమంతుడికీ తప్పని నోటీసులు..!

పాట్నా: దేవుడికీ తప్పడం లేదు పన్ను తిప్పులు, నోటీసులు. మాల్యా అయినా లార్డ్ హనుమాన్ అయినా మాకు ఒకటే అనుకున్నారో ఏమో కానీ...బీహార్‌లోని ఆరా టౌన్ మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను ఎగ్గొట్టారంటూ హనుమజ్జయంతి రోజే హనుమంతుడికి నోటీసులు పంపారు. సాధ్యమైనంత త్వరలో బకాయిల మొత్తం చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు. విషయం ఏమిటంటే...భోజ్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన ఆరాలోని బడీ మథాయ్ టౌన్‌లో లార్డ్ హనుమాన్ పేరుతో మూడు ఆస్తులు (ప్రాపర్టీ) ఉన్నాయి. వీటికి సంబంధించిన రూ. 4.33 లక్షల బకాయిలు పేరుకుపోతుండటంతో మున్సిపల్స్ కార్పొరేషన్ అధికారులు సంబంధిత టెంపుల్ అథారిటీస్‌కు తొలు సమాచారం పంపి...చివరి అస్త్రంగా లార్డ్ హనుమాన్‌కు నోటీసులు జారీ చేశారు. ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారికి నోటీసులు పంపే ప్రొవిజన్ ఉందని, హనుమాన్ పేరుతో మూడు ఆస్తులున్నందున ఆయన ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని ఆరా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో కూడా రోడ్డు పక్కనే ఉన్న ఓ హనుమాన్ ఆలయానికి సంబంధించి రోహ్‌టాస్ జిల్లాలోని దిగువ కోర్టు నేరుగా హనుమంతుడ్నే తమ ముందు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపింది. బెగుసరాయ్ జిల్లాలోనూ ఇదే తరహా వ్యవహారంలో లార్డ్ హనుమాన్‌కు నోటీసులు పంపింతే బజరంగ్ దళ్ కార్యకర్తలు హంగామా చేసి ఆ నోటీసును అధికారుల చేతే చెత్తబుట్టలో వేయించారు. హనుమంతుడికే కాదు, రామలక్ష్మణులపై కూడా గత ఫిబ్రవరిలో సీతామర్హి జిల్లాలోని ఓ లాయర్ ఫిర్యాదు చేశాడు. గర్భవతి అయిన సీతను రామలక్ష్మణులు నిర్దాక్షిణ్యంగా అడవుల్లో విడిచిపెట్టడమే ఇందుకు కారణమట. దేవుళ్లకు నోటీసులు ఇవ్వడం ఏమిటో? నేరుగా హాజరుకావాలనడం ఏమిటో? కాలమహిమ అని సరిపుచ్చుకోవాలేమో...?

No comments:

Post a Comment