Monday, 11 April 2016

వేతనాలు 12-25 శాతం పెరిగే అవకాశం


వేతనాలు 12-25 శాతం పెరిగే అవకాశం
పని మదింపు ‘తీరు’ మారుతోంది
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఇ కామర్స్‌ రంగాల్లో ఉద్యోగులకు వేతన పెంపు సగటు 10-12 శాతం ఉంటుందని, అధిక నైపుణ్యం కలిగిన వారికి మాత్రం ఈ పెరుగుదల 25 శాతం ఉంటుందని మానవ వనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగి, అత్యుత్తమ పనితీరు కనబర్చే వారికి వేతనం 20-25 శాతం పెరిగే అవకాశం ఉదని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చెబుతోంది. సగటు వేతనాల పెంపు 11 శాతంగా ఉంటుందని, ఐటీ రంగంలో 13.50 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ ఏడాది వేతన పెంపు సగటు 10-12 శాతం ఉంటుందని ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ సంస్థ గ్లోబల్‌హంట్‌ అభిప్రాయపడుతోంది. ఎప్పటికప్పుడే మదింపు: సంస్థ ఉన్నతి కోసం నిబద్ధతతో పని చేసే వారిని అందలం ఎక్కించేందుకు సంస్థలు ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తుంటాయి. ఇప్పటి వరకు ‘బెల్‌-కర్వ్‌ అప్రైజల్‌ సిస్టమ్‌’ ప్రకారం ఒక ఉద్యోగి నైపుణ్యాలను అదే స్థాయి ఉద్యోగులతో పోల్చి అంచనా వేస్తున్నారు. ఇది ఏడాదికి ఒకసారి జరుగుతోంది. ఇకపై నిరంతరం ఎప్పటికప్పుడు నివేదికలు పొందేలా విధానాలను రూపొందించే పనిలో పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అసెంచర్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కేపీఎంజీ వంటి దిగ్గజాలు ఇలా మారుతున్నాయి.

No comments:

Post a Comment