Wednesday, 13 April 2016

‘హనీమూన్ల వల్లే కేదారనాథ్‌లో వరదలు’: స్వరూపానంద వివాదాస్పదం...

          ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో కేదార్‌నాథ్‌లో సంభవించిన వరదలకు హనీమూనర్లే బాధ్యత వహించాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్‌లోని పవిత్రమైన ప్రాంతాలను సందర్శించడానికి వస్తారని తెలిపారు. అయితే వారిలో కొందరు హనీమూన్లకు, విహారయాత్రలకు వచ్చి అక్కడ అపవిత్రమైన పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేయడం వల్లే కేదార్‌నాథ్‌లో అంత పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని తెలిపారు. 
               అంతేగాక, పవిత్ర ప్రాంతాల్లో ఇలాంటి అపవిత్రమైన పనులు ఆపకపోతే ఇలాంటి ప్రకృతి విపత్తులు మళ్లీ మళ్లీ సంభవిస్తాయని హెచ్చరించారు. 2013లో కేథారనాథ్‌లో సంభవించిన వరదల వల్ల దాదాపుగా 5000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, రెండు రోజుల క్రితం కూడా ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. శనిసింగనాపూర్‌ గుడిలోకి మహిళలు ప్రవేశించడం వల్ల వారిని దురదృష్టం వెంటాడుతుందని, వారిపై అత్యాచారాలు ఇంకా పెరుగుతాయన్నారు. అలాగే మహారాష్ట్రలో షిర్డీ సాయిని పూజించడం వల్లే అక్కడ కరవు సంభవించిందని చెప్పారు. దేవుడిని పూజించడం మాని ఓ ఫకీర్‌ని పూజిస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుందని స్వరూపానంద సరస్వతి వార్తల్లో నిలిచారు.

No comments:

Post a Comment