Monday, 4 April 2016

వేసవిలో ఉపశమనం...

వేసవిలో వేడిగాలులు ఇబ్బందులకు గురిచేస్తాయి. వీటితో పాటు దోమలు, నీరు- ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఈ సీజన్‌లో వస్తాయి. దీంతో పాటు డీహైడ్రేషన్‌, టైఫాయిడ్‌, గ్యాసో్ట్ర, యూరినరీ సమస్యలు వస్తాయి. అందుకే ఏ మాత్రం కాస్త అజాగ్రత్తగా ఉంటే ఫలితం అనుభవించాల్సిందే అంటున్నారు వైద్యులు. ఇంతకీ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ..
  • ఇప్పటికే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండతాకిడికి తట్టుకోలేక చాలామంది వడదెబ్బ బారినపడుతుంటారు. ముఖ్యంగా బిపి తగ్గిపోతుంది. డయాబెటిస్‌, గుండెజబ్బులు ఉండే వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది డీహైడ్రేషన్‌కు గురి అవుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే నీరు బాగా తాగటం ముఖ్యం. కనీసం గంటకు రెండుసార్లైనా నీరు తాగటం మంచిది. మజ్జిగ, పెరుగు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
  • వేసవిలో ఏ ఆహారమైనా త్వరగా పాడవుతుంది. అందుకు కారణం త్వరగా బ్యాక్టీరియా పెరగటమే. కొన్ని గంటలపాటు, రోజులపాటు ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి తినటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీనికి తోడు ఆ ఆహారం తిన్న తర్వాత కడుపులో తిప్పటం లాంటి రకరకాల సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఎండకాలం తాజా ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వేసవిలో కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌ షేక్స్‌ తాగే అలవాటు ఉండే మానుకోవటం మంచిది. తీపితో పాటు రుచికరమైన ఫ్లేవర్స్‌ ఉండే ఇలాంటివి తాగటం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అందుకే కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగటం శ్రేయస్కరం. వీటితో పాటు కీరా, పుదీనా నీళ్లు, కాకరకాయ, వాటర్‌మెలన్‌.. లాంటి ఆహారాన్ని తీసుకుంటే వేసవితాపం నుంచి బయటపడవచ్చు.
  • చిన్న పిల్లలపై వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్‌ సమస్యలతో పాటు యూరినల్‌ సమస్యలు వస్తాయి. అందుకే నీరు బాగా తాగించాలి. ఆహారం తినేముందు పిల్లల చేతులు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. చల్లని నీరు, ఐస్‌క్రీమ్స్‌ తినిపించటం వల్ల గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేసవిలో డబ్లు.హెచ్‌.ఓ రెకమెండ్‌ చేసిన ఓఆర్‌ఎస్ (ఓరల్‌ డీహైడ్రేషన్‌ సాల్ట్‌)ను పిల్లలకు ఇవ్వటం ఆరోగ్యకరం.

No comments:

Post a Comment