ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఢిల్లీపై దృష్టి సారించారు. టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో జాతీయ నేతలతో సంబంధాలను మెరుగుపరచుకునే
దిశగా అడుగులు వేస్తున్నారు. ఇకపై నెలలో రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే
మకాం వేయనున్నారు. ఢిల్లీలో బసకు 1, జన్‌పథ్ బంగళాను ఏపీ ప్రభుత్వం సిద్ధం
చేస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు ఉండేందుకు వీలుగా కేంద్రం ఈ
బంగళాను కేటాయించింది. ఇందులో చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బస
చేయవచ్చు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెలనుంచే లోకేశ్ ‘ఢిల్లీ బస’
మొదలవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
లోకేశ్‌ను
రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిగా అరంగేట్రం చేయించాలని చంద్రబాబు
భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే... దొడ్డిదారిన
పార్లమెంటుకు, పదవిలోకి వచ్చారనే విమర్శలు వస్తాయని... ఆ ప్రతిపాదనను
విరమించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో... పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి హోదాలో లోకేశ్ ఢిల్లీలో పట్టు సాధించేందుకు రంగం సిద్ధం
చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో జాతీయ స్థాయిలో నిరంతర సంప్రదింపులు,
రాజకీయ సంబంధాల నిర్వహణ బాధ్యతను ఆయనకు అప్పగించాలనుకున్నట్లు తెలిసింది.
ఏపీకి రావాల్సిన నిధులపై వివిధ శాఖల మంత్రులతో లోకేశ్ ఢిల్లీలో లాబీయింగ్
జరపనున్నట్లు తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత
ఢిల్లీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని పార్టీల ఎంపీలు, నేతలతో
తరచూ సమావేశమవుతున్నారు. అప్పుడప్పుడూ విందులు ఇస్తుంటారు. కేంద్ర
మంత్రులను తన నివాసానికి ఆహ్వానిస్తుంటారు. కేసీఆర్ తరచూ ఢిల్లీకి
రాకపోయినా కేంద్రంలో తెలంగాణకు అడగ్గానే పనులు కావడానికీ ఇదీ ఒక కారణమని
టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే విధంగా ఏపీ ప్రభుత్వ బ్రాండ్
అంబాసిడర్‌గా, రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా కృషి చేయడంతోపాటు
అన్ని రకాల భవిష్యత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లోకేశ్ ‘ఢిల్లీ మకాం’
ఖరారైనట్లు చెబుతున్నారు.


No comments:
Post a Comment