Friday, 15 July 2016

ఏడుకొండల్లో 8 అద్భుతాలు...

‘ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద’ నామస్మరణతో తిరుమల యాత్రకు వెళితే దక్కే అనుభూతిని వర్ణించలేము. అయితే ఆ దేవదేవుడు కొలువు తీరిన శేషాచలసానువుల్లోని ప్రకృతి రమణీయతను కనులారా తిలకిస్తూ.. కొండకోనల్లో ట్రెక్కింగ్‌ చేస్తే.. ఆహా.. ఆ అద్భుతం చెప్పనలవి కాదు. తిరుమల కొండల్లో ట్రెక్కింగ్‌ చేయాలనుకునే సాహసవంతుల కోసమే ఈ ప్రత్యేక కథనం.. 


1 గుంజనా జలపాతం 

ఎక్కడి నుంచి : తిరుమల ఆలయం నుంచి 40 కిలోమీటర్ల పాదయాత్ర.
ఎన్ని రోజులు : ఐదు రోజులు
ఇలా వెళదాం :

పాపనాశనం నుంచి తొలి రోజు నడక మొదలవుతుంది. కుమార ధార మీదుగా గొల్లోళ్ళ రచ్చ దాటుకుని అన్నదమ్ముల బండ వరకు వెళ్లాక.. అక్కడ రాత్రి బస చేయాలి. రెండో రోజు - చామలకోన పైకి చేరుకుంటాం. ఆకుపచ్చని అడవిని తిలకించాలంటే అక్కడి నుంచే తిలకించాలి. ఆ అనుభూతి తనివితీరదు. అక్కడి నుంచి వెళితే జొన్నలరాసి దిబ్బ వస్తుంది. అప్పట్లో కరువు ఎక్కువ. దొంగల నుంచి కాపాడడానికి జొన్నలరాసిని బ్రిటీషువాళ్లు ఇక్కడ దిబ్బగా పోసి దాచేవాళ్లట. మూడోరోజు నడక మొదలుపెడితే.. భోగందాని పేటు, తువ్వేలు గుండు మీదుగా మొగిలి పెంట చేరుకుంటాం. తువ్వేలగుండు కూడలి ప్రదేశం నుంచి ఎడమవైపు వెళితే తలకోన జలపాతం వస్తుంది. తువ్వేలు గుండు నుంచి కుడివేపున 10 కిమీ దూరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన రుద్రగళతీర్ధం లేక యుద్దగళ తీర్థం ఉంది. ఇక్కడ రాత్రి బస చేయొచ్చు. నాలుగో రోజు హలాయుధ తీర్ధం, విష్ణుగుండం దర్శనం పూర్తవుతుంది. 200 అడుగుల ఎత్తు నుంచి విష్టుతీర్థ జలాలు నేలజాలువారే దృశ్యం ఆకట్టుకుంటుంది. సాయంత్రానికి కంగు మడుగు చేరుకుంటాం. అందమైన పచ్చికబయళ్లు సేద దీరుస్తాయి. అటవీ శాఖ వాచ్‌ టవర్‌ కూడా ఇక్కడ ఉంది. ఈ ప్రదేశం ఏనుగులకు విడిది స్ధలం. రాత్రిళ్ళు ఎర్ర చందనం దొంగలకు కూడా వసతి ప్రదేశమే! కొండల మీద చంద్రోదయం, మడుగులో చంద్రుని ప్రతిబింబం.. వోహ్‌.. పున్నమి రాత్రి ఇక్కడ బస చేయడం మధురానుభవం. మరుసటిరోజు దొంగలబండ దాటుకుని సాయంత్రానికి గుంజనా జలపాతం చేరుకుంటాం. జలపాతం సవ్వడి వింటూ ఆ రాత్రి అక్కడే గడపొచ్చు. తిరుమల జలపాతాలలో అత్యంత ఎత్తు నుంచి పారుతున్న జలపాతం ఇది. ఆ మరుసటి రోజు పొద్దున్నే లేచి వాగేటికోన జలపాతం పక్క నుంచి నడిచి గంగ రాజు పోడు గ్రామం చేరుకుంటాం. అక్కడనుంచి బస్సుల ద్వారా రైల్వేకోడూరు చేరుకోవచ్చు.  
2 శనీశ్వరతీర్థం 
ఎక్కడి నుంచి : తలకోన నుంచి పాపనాశనం వరకు సాగే సాహస యాత్ర ఇది.
ఎంత దూరం : 30 కిలో మీటర్ల నడక
ఎన్ని రోజులు : నాలుగు
ఇలా వెళదాం :
 
 
తొలి రోజు తలకోన సిద్ధేశ్వర స్వామికి నమస్కరించుకుని బయలుదేరుతాం. తలకోన జలపాతం శిఖరాగ్రం పైకి కాస్త కష్టపడి నడవాలి. అందమైన చోటు అది. తొలిమజిలీ అక్కడే. రెండో రోజు యుద్ధగళ తీర్థం వెళ్లి.. పాత రాతి యుగం నాటి రేఖా చిత్రాలను తిలకించవచ్చు. రెండో రాత్రి ఇక్కడే బస. కార్తిక పౌర్ణమి రోజున ఇక్కడ గడపడానికి ఇష్టపడతారు. బ్రిటీషు కాలంలో నిర్మించిన బంగ్లా ఆనవాళ్ళు కనిపిస్తాయి. మూడవరోజు కొండకోనల్లో నడుస్తూ వెళితే బ్రహ్మతీర్థం వస్తుంది. కొండమీద నుంచి పడే నీటి ధాటికి క్రింద భాగంలో గుండాలు ఏర్పడ్టాయి. వేయి మందికి పైగా ఒకేసారి విడిది చేయగల ప్రదేశం. తర్వాత పెద్దగోడకు చేరుకుంటాం. కొండలే చీలి పెద్ద గోడల్లా కనిపిస్తాయి. రాత్రి బస ఇక్కడే. గుహలోగానీ, మైదానంలో గానీ సేద తీరవచ్చు. నాలుగో రోజున శనీశ్వరతీర్థం చేరుకుంటాం. రెండు కొండల మధ్య ఇరుకైన దారిలో ప్రయాణం. ఒక వైపు పది అడుగుల వెడల్పు కలిగిన తేనే తెట్టులు, మరోవైపు కొండ అంచుల మీద నడక.. రోమాంఛిత అనుభవం. తేనెటీగలను చెదరగొట్టకుండా జాగ్రత్తగా నడవాలి. అక్కడి నుంచీ సహజమైన రాతి కోనేరు ఉన్న మునీశ్వర తీర్థం.. ఆ తరువాత కైలాసతీర్థం చేరుకుంటాం. నూటయాభై అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం కనిపిస్తుందిక్కడ. అడవిలో చెట్లు విస్తృతంగా ఉంటాయి. ఈ చెట్ల కాండం మధ్యలో ఉండే గుజ్జుని ఏనుగులు ఇష్టంగా తింటాయి. అందుకే ఇది ఏనుగుల నివాసం. ఏనుగుల ఘీంకారం వినిపించగానే సంచార యాత్రికుల గుండె ఝల్లుమంటుంది. కానీ అవి మాత్రం ఎకో ఫ్రెండ్లీ. మనుషుల సమూహాలను చూసి దూరంగా తప్పుకుంటాయి. ఇక్కడ నుంచి గొల్లోళ్ళ రచ్చ మీదుగా లక్ష్మితీర్థం చేరుకోగానే తిరుమల బంగారు గోపురం కనిపిస్తుంది. కుమారధార తీర్థం పైనుంచీ పాప వినాశనం చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది.  
 
3 పిత్రుగళ తీర్థం
 

ఎన్ని రోజులు : రెండు రోజులు
దూరం : 35 కిలోమీటర్లు
ఇలా వెళదాం :

అప్పట్లో శేషాచలంలో పిత్రుగళతీర్థం ఆదిమానవులకు ఆవాసం. కుక్కలదొడ్డి నుంచీ నడక మొదలవుతుంది. తొలిగా ఎఱ్ఱెడ్ల మడుగు చేరుకుంటాం. ఇక్కడి కొండలు ఎర్రగా వుంటాయి. ఎర్ర మట్టితో నీరు కూడా అదే రంగులో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆరుమేనుబండ గుట్ట మీదకు చేరుకుంటాం. అటవీ శాఖ వాచ్‌టవర్‌ మీద నుంచి పచ్చని లోయను చూడవచ్చు. కంగుమడుగులో రాత్రి బస చేయవచ్చు. మరుసటి రోజు గుంజనా జలపాతం మీదుగా పితృగళతీర్థం చేరుకుంటాం. ప్రాచీన మానవుల జీవన చిత్రాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. ఈ ప్రదేశాన్ని పులగూర పెంట అని కూడా అంటారు. కొత్తగా కట్టిన ఫారెస్టు షెడ్‌ యాత్రికులకు రక్షణ కలిగిస్తుంది. అక్కడి నుంచీ గంగరాజుపోడు గ్రామం చేరటంతో యాత్ర ముగుస్తుంది.
 
4 శుద్ధోదకం తీర్థం 
ఎన్ని రోజులు : మూడు రోజులు
దూరం : 50 కిలోమీటర్లు
ఇలా వెళదాం :
ఈ యాత్ర కుక్కల దొడ్డి నుంచి ప్రారంభించి తలకోన చేరటంతో ముగుస్తుంది. అక్టోబర్‌ నుంచి జనవరి వరకు చక్కని వాతావరణం వుంటుంది. కుక్కల దొడ్డి నుంచి తొలుత సీదానీడు చేరుకుంటాం. పచ్చని కొండల మధ్య నెలకొన్న శుద్ధోదక తీర్థం చూడముచ్చటగా వుంటుంది. అక్కడే మధ్యాహ్న భోజనం, కాస్త విశ్రాంతి. ఆ తర్వాత తీర్థంలోని బండ మీద ధ్యానం. చీకటిపడే వేళకు అష్టావక్ర తీర్థం చేరుకుంటాం. ఆ రాత్రి బసచేస్తాం. ఈ తీర్థం అష్టవంకరులుగా వుండటంతో ఈ పేరు స్థిరపడిపోయింది. తెలవారుతుండగానే కొండలలో ప్రకృతి అందాల నడుమ అలసట తెలియకుండా ప్రయాణం సాగిపోతుంది. చాలాదూరం నడిచిపెద్ద గోడ చేరుకుంటాం. అక్కడి నుంచీ శనీశ్వరతీర్థం దర్శించుకుని, నారాయణితీర్థం మీదుగా బ్రహ్మ దేవుని గుండాలు చేరుకుంటాం. ప్రవాహ ఝరిలో శిల్పాల్లా మారిన రాళ్ళు ఆశ్చర్యం కలిగిస్తాయి. అక్కడ స్నానం అపురూపం. రాత్రి బస ఇక్కడే. తర్వాతి రోజు యుద్ధగళ తీర్థం దర్శించుకుని బయలుదేరితే తలకోన వస్తుంది. సిద్ధేశ్వరుని దర్శించుకుని బస్సుల్లో తిరుపతికి చేరుకోవచ్చు.
 
 
5 తుంబుర, కన్యకా తీర్థాలు
 
ఎంత సమయం : రెండు రాత్రులు, మూడు పగళ్లు
ఎంత దూరం : 25 కిలోమీటర్లు
ఇలా వెళదాం :

కుక్కల దొడ్డి నుంచి తిరుమల పాపనాశనం వరకు సాగే యాత్ర ఇది. కుక్కలదొడ్డి నుంచి పందిగుంట మీదుగా, బండిఇరుసుల బాటలో నడక సాగుతుంది. బ్రిటీషర్ల కాలంలో ఎడ్లబండ్ల మీద ప్రయాణం చేసేవారట. అక్కడే రాత్రి బస. తెలవారగానే చాకిరేవు బాన చేరుకుంటాం. బట్టలు ఉతికే బానలా వుండటంతో ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. అక్కడి నుంచీ కొండమీదకు చేరుకుని దేవతీర్ధం దర్శించుకుంటాం. కొండమీద నుంచి పడుతున్న నీటిధారలలో తడిచి, చిన్న చిన్న గుండాలలో ఈదులాడి చెంచువారిపేటు చేరుకుంటాం. మధ్యాహ్నం భోజనాలు ముగించుకున్న తరువాత సన్యాసోళ్ళ గవి, వెంగమాంబగవి చేరుకుంటాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వందల సంవత్సరాల కిందట ధ్యానం చేసిన గుహ ఇది. ఇక్కడే మలయాళ తపస్సు చేసుకుంటూ, గీతాసారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత అఘోరా శ్రీనాథ్‌ ఘోరి బాబా ఆశ్రమంగా గవి మారింది. వెంగమాంబ జ్ఞాన సిద్ది సాధించిన గవిలో రాత్రి బస. ప్రతి ఫల్గుణి పౌర్ణమికి యాత్రికుల సందడి కనిపిస్తుంది. తదుపరి తుంబురతీర్ధం చేరుకుంటాం. సముద్రమట్టానికి 2250 అడుగుల ఎత్తున నిలిచి పారుతూ, పాపవినాశం తీర్ధంలో ఈ జలాలు కలిసిపోతాయి. కొండలు రెండుగా చీలిన చోటు నుంచి వచ్చే గాలి హోరుగా వేణునాదంలా, తుంబురనాదంలా గోచరిస్తుంది. పౌర్ణమి రాత్రి రెండు కొండల నడుమ చంద్రుని ప్రయాణం ఓ మరువలేని అద్భుత దృశ్యం. తీర్థం దారుల వెంట విరగ కాసిన ఉసిరిచెట్లు, కరక్కాయల చెట్లు కనిపిస్తాయి. 10 అడగులమేర పెరిగిన పుట్టలు, 50 అడుగల ఎత్తున నిటారుగా మహావృక్షాలు కనువిందు చేస్తాయి. రాత్రి అక్కడే గడిపి, తెలతెలవారుతుండగా తిరిగి బయలుదేరుతాం. కన్యకాతీర్ధం మీదుగా పాప వినాశనం దర్శనంతో యాత్ర ముగిసిపోతుంది.
 
 
6 ఈతమండపం 
ఎన్ని రోజులు : రెండు రోజులు
ఎంత దూరం : 20 కిలోమీటర్లు
ఇలా వెళదాం :

కుక్కల దొడ్డి నుంచి తిరుమలకు సాగుతుందీ యాత్ర. అవ్వాతాతగుట్ట మీదుగా అన్నమయ్య మార్గంలోని మార్కండేయ తీర్థం, మసాల రేవులు చేరుకుంటాం. రాత్రి బస అక్కడే. మరుసటి దినం మార్కండేయ తీర్థం నుంచి పడమరవైపు 3 కి.మీ. ప్రయాణం చేసి ఫల్గుణి తీర్థం చేరుకుంటాం. అక్కడున్న గుట్ట ప్రక్కనే వున్న కాలువ మీదుగా ప్రయాణం చేస్తే గరుడ తీర్థం వస్తుంది. దూరం నుంచి చూస్తే ఎగురుతున్న గరుడపక్షి లాగా కొండ కనిపిస్తుంది. అక్కడి నుంచీ గంధర్వ తీర్థం చేరుకుంటాం. అది రహస్యమైన గుహలా కనిపించి అబ్బుర పరుస్తుంది. ఆ సాయంత్రం పెద్ద సత్రాలు చేరతాం. మూడు వందల సంవత్సరాల క్రితం వెంకటగిరి రాజులు నిర్మించిన సత్రాలున్నాయి. అక్కడి నుంచీ ఎలుగులు, ఏనుగులు, దుప్పులు, జింకలు, సాంబారులు, ఇతర జంతువులకు నీటి ఆధారం అయిన పుల్లుట్ల చెరువు చేరుకుంటాం. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్న కొద్దీ, దారిపొడుగునా నిగనిగలాడే ఈతకాయల గుత్తులతో చెట్లు స్వాగతం పలుకుతాయి. కొంత దూరం పోయాక ఈతకాయల మండపం కనిపిస్తుంది. నాడు ఒక భక్తురాలు ఈతకాయలమ్మటం ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ రాతి మండపం కట్టించారని ప్రచారం. ఈ ప్రాంతంలో భల్లూకాలు విపరీతంగా తిరుగుతుంటాయి. ఈతపండ్లు వాటికి చాలా ఇష్టం. మనుషుల గుంపులు కనిపించగానే దూరంగా వెళ్లిపోతాయి. ఇక్కడి నుంచీ పదిహేను నిమిషాలు కాలి నడకతో గోగర్భం దాటి పార్వేటి మండపం చేరుకోవటంతో యాత్ర ముగిసిపోతుంది.
 
 
7 గుండాలు..దశావతారాలు  
సమయం : రెండు రాత్రులు, మూడు పగళ్లు.
దూరం : ఏడు కిలోమీటర్లు
ఇలా వెళదాం :

పాచికాలవ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి కాకుల దిన్నె, సానరాళ్ళమిట్ట మీదుగా సామిరెడ్డి గుంత దాటాలి. నడిచేదారి ప్రమాదకరం. దారిరెండు వైపులా లోయలు. పాచిమడుగు, అవ్వాచారికోనలు! కొంత దూరం పోయాక పోలిగాడిశిల, సున్నపురాయి కొండలు వస్తాయి. వాటిమధ్య మిట్టమీద దారిలో నడిచి వెళితే శేషతీర్ధం కొండమీదకు చే రుకుంటాం. ఇక్కడ నుంచి పడమర వైపు ఐదు వందల అడుగులు లోయ. క్రిందకు దిగటం ద్వారా శేషతీర్ధ చివరితోక భాగానికి చేరుకుంటాం. ఆకాశాన్ని తాకుతున్న విధంగా ఎతైన చెట్లు, ఎర్రచందనం, పుల్లమామిడి చెట్లు విస్తారంగా వుంటాయి. కాకులు దూరని కారడవి. ఆ నిర్జన ప్రదేశంలో ఆదిశేషుడు పడుకుని పడగెత్తిన విధంగా శిలాకృతి రూపుదిద్దుకోవటం ప్రకృతి సృష్టించిన చిత్రం. అక్కడ నుంచి ప్రవాహానికి ఎదురుగా మూడు వందల అడుగులు నడవటం ద్వారా ఆదిశేషుడి తలలా గోచరించే గుండం మనకు కనిపిస్తుంది. అది మూడు గుండాల వారధి. మడుగుల్లో పాములు వుంటాయి. ఈ గుండాలలో స్నానాలు చేయటానికి తాడు, ట్యూబ్‌ తప్పని సరి. తదుపరి సప్తఋషుల గుహల వద్దకు చేరుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. చాలా గుహలు వుండటంతో వీటికి ఆ పేరున వ్యవహారనామం మిగిలింది. ఉదయం రాక్‌ క్లైబింగ్‌ తప్పని సరి. తాడు సహాయంతో ఉత్తరం వైపుకి మన ప్రయాణం సాగుతుంది. మూడు కిలో మీటర్లునడవటంతో దశావతారతీర్ధం దర్శన మిస్తుంది. వరుసగా పది నీటి గుండాలు వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రాత్రి అక్కడే బస. ఈ ప్రదేశం నుంచి దక్షిణం వైపు తిరిగి కొంత దూరం నడిచి, ఆ తరువాత ఉత్తరం దిక్కు ప్రయాణంతో అమృతతీర్థం చేరుకుంటాం. ఈ ప్రయాణం అంతా కొండ ఎక్కడమే! మరింత పైకి వెళితే సీతమ్మ తీర్థం చేరుకుంటాం. అక్కడి నుంచి ఈత కాయల మండపం మీదుగా తిరుమల చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది.
 
8 శక్తికఠారి.. సాహసయాత్ర 
ఎన్ని రోజులు : రెండు రోజులు
ఎంత దూరం : ఐదు కిలోమీటర్లు
ఇలావెళదాం :

తిరుమల తీర్థాలన్నింటిలోకి భిన్నంగా వుండి గగుర్పాటు కలిగించే సాహసయాత్ర శక్తికఠారి. అక్టోబర్‌ నుంచి జనవరి వరకు వర్షాలు సమృద్ధిగా వుండటంతో నీటితో జలపాతాలు కళకళలాడుతుంటాయి. ఇది రెండు రోజుల యాత్ర. తిరుమల పాపనాశనం నుండి సనకసనందన తీర్ధాలు మీదుగా చలువబండలు చేరుకుంటాం. చాలమంది ఇక్కడ బస, భోజనం చే స్తారు. రామకృష్ట తీర్థం దారిలో ఒక పర్లాంగు దూరం ప్రయాణ ం చేసిన తరువాత ఎడమ వైపు దారిలో పయనిస్తే శక్తికఠారి గుట్టమీదకు చేరుకుంటాం. విశాలమైన ప్రదేశం, మధ్యలో జలధారలతో పచ్చని ఆడవిలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రాత్రి బస చేస్తాం. అక్కడి నుంచీ రెండో రోజున తాంత్రికలోయ ప్రయాణం. లోతైన చీకటి గుండం. సాహసంతో కూడిన ప్రయాణం. కాలు జారితే గల్లంతు ఖాయం. తదుపరి అశ్వనీతీర్థం చేరుకుంటాం. ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ. తదుపరి రామకృష్ణ తీర్థం చూడొచ్చు. తిరుమల దేవాలయానికి 10.5 కి.మీ దూరంలో ఈ తీర్థం కొలువుతీరింది. పసుపు, కుమారతీర్థాల నుండి జాలువారుతున్న నీరు రామకృష్ణ తీర్థం చేరుతుంది. రెండు ఎతైన కొండల మధ్యన పడమరవైపు రాతినేలమీద ఓ పెద్ద నీటి సరస్సు. కొండ అంచుల నుంచి క్రిందికి పారే జలపాతం. తెలవారితే పడమరవైపు ప్రయాణం చేయటంతో పాప వినాశనం ఆనకట్ట కనిపిస్తుంది.
 
 
అనుమతులు ఎలా తీసుకోవాలి..

  • బయోస్పియర్‌ రిజర్వు కార్యాలయాల నుండి అనుమతులు తీసుకోవాలి. 
  • తిరుపతి- కడపలకు చెందిన ఉన్నతస్థాయి అటవీ శాఖ అధికారులు అందుబాటులో వుంటారు. 
  • అటవీ పరిశోధన చేసే విద్యార్థులు, తిరుపతి నగరంలోని బయోడైవర్సిటీ ల్యాబ్‌ అధికారులను సంప్రదించి మాత్రమే పరిశోధనలకు పూనుకోవాలి. ఫోన్‌ : 0877-2280977 
  • తిరుపతి కపిలతీర్థ వన్యప్రాణ నిలయంలోని అటవీకార్యాలయం కూడా అనుమతులు మంజూరు చేస్తుంది. ఫోన్‌ : 0877-2231887- 2280980 
  • వ్యక్తుల పేర్లు, చిరునామా, ఆధార్‌ కార్డు నకలు, ఫోన్‌ నెంబరు వివరాలను ఫారంలో పూర్తి చేసి నకలు కాపీలను కూడా జతచేయాలి.. 
  • అటవీ శాఖ పొందుపరిచిన రుసుమును ఆంధ్రాబ్యాంక్‌ లేదా స్టేట్‌బ్యాంకు లేదా నిర్ధేశించిన బ్యాంకు నందు చెల్లించి, రసీదును అభ్యర్థన పత్రానికి జతచేయాలి. 
  • అటవీ శాఖ వారి సారధ్యంలో గైడ్లను నియమిస్తారు. వీరికి ప్రత్యేకంగా సేవలరుసుమును అటవీ శాఖ అధికారులు నిర్ధేశించిన విధంగా చెల్లించాలి. 
  • అటవీ, టీటీడీ, ప్రైవేటు వసతి సౌకర్యాలు ఉన్నాయి. 
  • అటవీ శాఖ అధ్వర్యంలో నడుపుతున్న మామండూరు, బాలపల్లె అటవీశాఖ అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి. 
చిరునామా  :
యూత్‌ హాస్టల్‌, న్యూబాలాజీ కాలనీ, నియర్‌ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌, తిరుపతి- 517501.
ఫోన్‌ - 0877 2240300
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృధి శాఖ ద్వారా వసతి, పర్యటన సౌకర్యాలను పొందవచ్చు. శ్రీదేవి కాంప్లెక్స్‌, తొలి అంతస్తు, తిలక్‌ రోడ్‌,
తిరుపతి.
ఫోన్‌ : 0877-2289120.
 
 

No comments:

Post a Comment